జగన్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగి వేసారి పోయారని టిడిపి నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయని, ఆ తర్వాత వైసిపి బంగాళాఖాతంలో కలవడమేనని టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పటికే జోస్యం చెప్పారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ తెలుగు తమ్ముళ్లలో కొత్త జోష్ నింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరులో పర్యటించిన టిడిపి అధినేతకు రాయలసీమ వాసులు ఘన స్వాగతం పలికారు.
చంద్రన్న పాలన మళ్లీ రావాలి అంటూ కర్నూలు జిల్లా ప్రజలు చంద్రబాబుకు జేజేలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలతో చంద్రబాబును సత్కరించిన తెలుగు తమ్ముళ్లు ఆయనను చూసేందుకు వేల సంఖ్యలో తరలివచ్చారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని మార్కాపురం గ్రామంలో నకిలీ విత్తనాల కారణంగా దిగబడి కోల్పోయిన పత్తి పంటను చంద్రబాబు పరిశీలించారు. నకిలీ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయామని, ప్రజాప్రతినిధులు కూడా విత్తనాల కంపెనీల వారితో కుమ్మక్కై తమను దగా చేశారని పత్తి రైతులు చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకుముందు, ఓర్వకల్లు ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబు వస్తేనే జాబు వస్తుంది అంటూ కర్నూలు యువత నినదించారు. కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫీజు రీఇంబర్స్ మెంట్ తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా, కర్నూలు జిల్లాలో చంద్రబాబు నేటి నుండి మూడు రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రెండు రాత్రులు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో బస చేయనున్నారు.
"చంద్రన్న పాలన మళ్ళీ రావాలి" కర్నూలు జిల్లా ప్రజల మనోగతం ఇది. తమ జిల్లాలో అడుగిడిన తెలుగుదేశం అధినేతకు కర్నూలు జిల్లా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు.#CBNInKurnool pic.twitter.com/Qpp2TTOHMP
— Telugu Desam Party (@JaiTDP) November 16, 2022