ఉద్యోగు ప్రదాతగా పేరు గడించిన సుమనస్కులు, ఆదర్శ జీవితం గడిపిన స్ఫూర్తి మంతులు, ‘మన్నం వెంకటరమణ’ ఇక లేరు.
అమెరికా నుంచి భారత దేశంలోని స్వస్థలానికి వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానంలోనే గుండెపోటుకు గురయ్యారు.
దీంతో విమాన సిబ్బంది ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
అయినప్పటికీ, మృత్యువుతో పోరాడిన ఆయన చివరకు తుదిశ్వాస విడిచి అనంత లోకాలకు ఏగిపోయారు.
ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి ప్రకాశం జిల్లా, దర్శి ప్రాంతానికి చెందిన మన్నం ‘వెంకట రమణ’ దశాబ్దాల కిందటే అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు.
ఈ క్రమంలో ఆయన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (‘తానా’) లోనూ ఆయన యాక్టివ్‌గా పనిచేసేవారు.
ఎంతో మంది భారత్ నుంచి అమెరికాకు వచ్చిన నిరుద్యోగులకు న్యూజెర్సీలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి, తన ఉదారతను, మనసును చాటుకున్నారు.
వారం రోజుల క్రితం అమెరికా నుంచి ఇండియా వస్తూ ఫ్లైట్ లో గుండెపోటుకు గురయ్యారు.
న్యూయార్క్ లోని ఈడబ్ల్యుఆర్(EWR) ఎయిర్ పోర్టు నుంచి ఎమిరేట్స్ విమానంలో ఆయన భారత్‌కు బయలు దేరారు.
ఈ విమానం వయా దుబాయి మీదుగా హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది.
అయితే, మార్గ మధ్యంలో ‘మన్నం వెంకట రమణ’కు గుండె పోటు వచ్చింది.
ఈ విషయం తెలిసిన విమాన సిబ్బంది వెంటనే విమానాన్ని ‘గ్రీస్‌లోని ఏథెన్స్’లో నిలిపివేసి, ఆయనను ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ఆయనకు ప్రత్యేక చికిత్సలు అందించారు.
అయినప్పటికీ, మృత్యువుతో పోరాడిన ‘మన్నం’ చివరకు తుదిశ్వాస విడిచారు.
‘మన్నం వెంకటరమణ’ గీత అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నారు.
వీరి దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు, ఒక పాప కలిగారు.
కాగా, 2009 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లో ఆయనకు 53 వేల పైచిలుకు ఓట్లు లభించాయి.
అయితే కాంగ్రెస్ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ చేతిలో గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు.
‘మన్నం’ మృతి పట్ల ఎన్నారైలు, ‘తానా’ పరివారం, ‘తానా’ అధ్యక్షుడు ‘నిరంజన్ శృంగవరపు’ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
‘నమస్తే ఆంధ్ర’ ‘మన్నం వెంకటరమణ’ కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియచేస్తోంది.