ఇది సోషల్ మీడియా జమానా. కొంచెం టాలెంట్ ఉన్నా చాలు…ఓవర్ నైట్ లో సెలబ్రిటీలు అయిపోయే చాన్స్ ఉన్న కాలం. ఇక, ఆల్రెడీ సెలబ్రిటీలుగా, పాప్ సింగర్ లుగా, యూట్యూబర్లుగా పేరున్న కొందరికి ఈ సోషల్ మీడియాతోనే విపరీతమైన స్టార్ డమ్, క్రేజ్ వచ్చాయి. ఈ మధ్య కాలంలో జనానికి నచ్చిన…జనం మెచ్చిన పాటలు గంటల వ్యవధిలో వైరల్ అవడానికి కూడా సోషల్ మీడియానే కారణం. ఈ కోవలోనే తాజాగా ఓ పాప్ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.
ఇటీవలి కాలంలో ‘బుల్లెట్ బండి’ పాట పాపులర్ అయిన తరహాలోనే ‘మాణికే మాగే హితే’ అనే పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తమిళ, మలయాళ భాషల్లో ఉన్న ఈ పాట లిరిక్స్ అర్థం కాకపోయినా సరే….తెలుగుతోపాటు హిందీలోనూ చాలా మంది సంగీత ప్రియులు ఈ పాటకు ఫిదా అయ్యారు. ఏకంగా బాలీవుడ్ బిగ్ డీ కూడా ఈ పాటకు మంత్ర ముగ్ధుడయ్యాడంటే ఆ పాటకున్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. ఆ లిరిక్స్ తనకు అర్థం కాకపోయిన ఆ పాట తన మనసుకు హత్తుకుందని బిగ్ బీ కితాబివ్వడం విశేషం.
వాస్తవానికి ‘మాణికే మాగే హితే’ పాట ఒరిజినల్ వెర్షన్ శ్రీలంక అధికారిక భాష అయిన సింహళ భాషలో మొదటగా 2020 జులైలో విడుదలైంది. ఈ పాటకు కవర్ ను శ్రీలంకలోని కొలొంబోకు చెందిన యొహాని డి సిల్వా అనే పాప్ సింగర్ పాడి 2021మేలో యూట్యూబ్ లో విడుదల చేసింది. పాప్ సింగర్, గేయ రచయిత, నిర్మాత, బిజినెస్ ఉమెన్ గా పాపులర్ అయిన యొహాని పాడిన ఈ పాట…విడుదలైన కొద్ది రోజుల్లోనే వైరల్ అయింది.
యూట్యూబర్‌గా కెరీర్ ఆరంభించిన యొహాని ‘దేవియంగే బారే’ అనే పాటతో గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్ లో ఎన్నో పాప్ పాటలు చేసి ‘రాప్ ప్రిన్సెస్’ అనే బిరుదు దక్కించుకుంది. ఇక, యొహానికి గుర్తింపు తెచ్చిన మాణికే మాగే హితే పాట యూట్యూబ్‌లో 8 కోట్లకు పైగా వ్యూస్ తో రికార్డులు బద్దలు కొట్టింది. సతీషన్ రత్నాయకతో కలిసి యొహాని ఆలపించిన ఈ పాటకు శ్రీలంక, ఇండియా, బంగ్లాదేశ్ తో పాటు పలు దేశాల్లో పాపులర్ అయింది. ఈ పాటకు సంగీతం అందించి, నిర్మించిన చమత్ సంగీత్ సంగీత చమత్కారానికి అందరూ ఫిదా అయ్యారు.