బెంగుళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమ తో పాటు పలువురు సెలబ్రిటీలు దొరికిన సంగతి తెలిసిందే. నటి హేమ పార్టీలో ఉన్నారని, ఆమెకు డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ రావడంతో పోలీసులు నోటీసులు పంపించినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఆ వ్యవహారంపై స్పందించారు. హేమపై కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విష్ణు అన్నారు.
నిజనిర్ధారణ చేసుకోకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని కోరారు. నేరం నిరూపితమయ్యే వరకు హేమను నిర్దోషిగానే భావించాలన్నారు. హేమ ఒక తల్లి, ఒక భార్య అని, ఆ పుకార్ల ఆధారంగా ఆమె ఇమేజ్ ను దెబ్బతీయొద్దని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ‘మా’ సహించబోదని, హేమ తప్పు చేసినట్టు పోలీసులు కచ్చితమైన సాక్ష్యాధారాలు అందిస్తే ‘మా’ తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అప్పటి వరకు సంచలనాత్మక వార్తలను, నిరాధార వార్తలను ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలకు హితవు పలికారు.