ఉన్నట్లుండి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేన్ (మా) ఎన్నికల వ్యవహారం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. స్వతహాగా కన్నడిగుడైన ప్రకాష్ రాజ్.. తెలుగు సినీ నటులంతా కలిసి పెట్టుకున్న ‘మా’ అధ్యక్షుడిగా పోటీకి సై అనడం ఆసక్తి రేకెత్తించింది. ఆయనకు మెగా బ్రదర్ నాగబాబు మద్దతు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నాగబాబు సపోర్ట్ అంటే.. పరోక్షంగా చిరంజీవి బ్యాకప్ కూడా ప్రకాష్ రాజ్‌కు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ప్రకాష్ రాజ్ నాన్-లోకల్ అనే ఫీలింగ్ రాకుండా ఆయన ఏదో ఒక భాషకు చెందిన నటుడు కాదని, భారతీయ నటుడని వ్యాఖ్యానించాడు నాగబాబు. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్ష’ ఎన్నికల్లో ప్రకాజ్ రాజ్‌ను ఢీకొట్టేదెవరన్న ప్రశ్న తలెత్తింది. ఐతే మంచు విష్ణు బరిలో నిలవబోతున్నట్లుగా వస్తున్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నిజంగా ప్రకాష్ రాజ్ వెర్సస్ మంచు విష్ణు చూడబోతుంటే రసవత్తర పోరుకు రంగం సిద్ధమైనట్లే.
ప్రకాష్ రాజ్‌కు చిరంజీవి సపోర్ట్ ఉన్నట్లయితే.. తన మిత్రుడైన మోహన్ బాబు తనయుడు మంచు విష్ణుతో మెగాస్టార్ ఎలా వ్యవహరిస్తాడన్నది ఆసక్తికరం. ఇది మోహన్ బాబు, చిరుల మధ్య చిచ్చు రేపినా రేపొచ్చు. ఒకప్పుడు చిరు, మోహన్ బాబు మంచి మిత్రులే కానీ.. మధ్యలో ఇద్దరి మధ్య కొంత అంతరం వచ్చింది. అనవసర వివాదాలు ఇద్దరినీ దూరం చేశాయి. కానీ కొన్నేళ్ల ముందు నుంచి ఇద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారు. బంధం బలపడుతూ వచ్చింది.
ఈ మధ్యనే వచ్చిన మోహన్ బాబు సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్‌కు చిరు గాత్రదానం కూడా చేశారు. అలాంటిది ఇప్పుడు చిరు సపోర్ట్ ఉన్నట్లుగా చెబుతున్న ప్రకాష్ రాజ్‌ను మంచు విష్ణు ఢీకొంటే అది మెగాస్టార్‌కు ఇబ్బంది కలిగించేదే. ఇక ఇండస్ట్రీలోని ‘మా’ సభ్యులు ఎటు వైపు మొగ్గుతారన్నది ఆసక్తికరంగా మారుతుంది. కాగా విష్ణుకు ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్ సపోర్ట్ ఉన్నట్లుగా చెబుతున్నారు.