టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమై, భారీ చిత్రంతో రాబోతున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి అతను కలలు కంటున్న సినిమా ‘కన్నప్ప’ను ఇటీవలే విష్ణు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ కోసం వందల మందితో కూడిన కాస్ట్ అండ్ క్రూ ఈ మధ్యే న్యూజిలాండ్‌కు వెళ్లింది. అక్కడ భారీ లొకేషన్లలో సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఐతే అక్కడ తాజాగా అనుకోని ప్రమాదం జరిగినట్లు సమాచారం.
డ్రోన్ పరికరం మంచు విష్ణుకు బలంగా తాకి అతడి చేతి మీద పలు చోట్ల గాయాలు అయ్యాయట. మరీ ప్రమాదం లేకపోయినా.. గాయాలైతే కొంచెం గట్టిగానే అయినట్లు సమాచారం. దీంతో చిత్ర బృందం అత్యవసరంగా షూటింగ్ ఆపేసి ప్యాకప్ చెప్పేసినట్లు సమాచారం. చికిత్స అనంతరం ప్రస్తుతం మంచు విష్ణు విశ్రాంతి తీసుకుంటున్నాడు. కొన్ని రోజుల పాటు షూటింగ్ ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ‘కన్నప్ప’లో మంచు విష్ణుకు జోడీగా ఎంపికైన నుపుర్ సనన్ కొన్ని కారణాలతో తప్పుకుంది. ఆమె స్థానంలో మరో కథానాయికను ఎంపిక చేయకుండానే చిత్ర బృందం ఫారిన్‌కు వెళ్లిపోయింది. కథానాయికతో సంబంధం లేని కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో ప్రభాస్, నయనతార శివ పార్వతుల పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. వాళ్లిద్దరి డేట్లను పట్టి ఒక వారం రోజుల పాటు షూటింగ్ పెట్టుకుంటారట. అందుకు ఇంకా చాలా టైం ఉందని సమాచారం. ఈ చిత్రంలో మలయాళ లెజెండరీ యాక్టర్ మోహన్ లాల్ కూడా ఓ కీలక పాత్ర చేయనున్నాడు. ఆయన కూడా చిత్రీకరణకు హాజరు కావడానికి సమయం ఉంది. వంద కోట్లకు పైగా బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కనుండటం విశేషం.