గత కొద్ది నెలల నుంచి మంచు ఫ్యామిలీ వివాదం నలుగుతూనే ఉంది. మంజు మనోజ్ ఒకవైపు.. మంచు విష్ణు, మోహన్ బాబు మరోవైపు అన్నట్టుగా విభేదాలు బయటపడ్డాయి. కూర్చుని మాట్లాడుకోవాల్సిన వారే కోర్టులు, కేసులు అంటూ ఇంటి పరువును బజారుకీడ్చారు. క్రమశిక్షణకు మారుపేరు అయిన మోహన్ బాబు ఇమేజ్ మొత్తాన్ని కొడుకులిద్దరూ డ్యామేజ్ చేసి పడేశారు. ఇప్పటికీ మంచు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మంచు మనోజ్, మంచు విష్ణు ఎప్పటికప్పుడు మీడియా ఎదుట ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూనే ఉన్నారు.
తాజాగా `కన్నప్ప` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు.. తన తండ్రి మోహన్ బాబును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `ప్రస్తుతం నా మైండ్ లో ఏమీ లేదు. నా కాన్సెంట్రేషన్ మొత్తం మా నాన్న మోహన్ బాబు గారిని సంతోషంగా చూసుకోవడం పైనే ఉంది. ఆయన పడిన కష్టానికి నేను ఆయనకు మంచి పేరు తీసుకురాకపోయినా పర్లేదు.. కానీ చెడ్డ పేరు మాత్రం తీసుకురాకూడదు. ఏ రోజైతే ఆయనకు నేను చెడ్డ పేరు తెస్తానో.. ఆ రోజున ఒక కొడుకుగా నేను బ్రతికున్నా, చచ్చినా ఒకటే. మా నాన్న లేకపోతే నేను లేదు.
నేను బ్రతికున్నంత వరకు మా నాన్నకు చెడ్డ పేరు తీసుకురాను. మనందరికీ మన ఫాదర్స్ అంటే ఇష్టం. వాళ్లు పడ్డ కష్టాలు, త్యాగాలు మనం తండ్రులయ్యాకే తెలుస్తాయి` అంటూ మంచు విష్ణు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, `కన్నప్ప` విషయానికి వస్తే.. ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ పాత్రలో కనిపించబోతున్నారు. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రను పోషించారు. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమైన కన్నప్ప జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.