టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు, హీరో మంచు విష్ణు వీరిద్దరిపై కొంతకాలంగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్ర ప్రమోషన్ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడిన మాటలపై ట్రోలింగ్ జరిగింది. ఆ సినిమాలో ఒక పాట చిత్రీకరణకు గాను గ్రాఫిక్స్ కోసం భారీగా ఖర్చు చేశామంటూ మోహన్ బాబు చెప్పడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
అప్పటినుంచి మంచు ఫ్యామిలీపై నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తమ కుటుంబంపై కావాలనే కొందరు సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ట్రోలింగ్ చేయిస్తున్నారని మంచు విష్ణు కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. ఇక, తాజాగా మంచు విష్ణు తాను నటించిన జిన్నా చిత్ర ప్రమోషన్ సందర్భంగా మరోసారి అ ట్రోలింగ్ వ్యవహారంపై స్పందించారు. తనపై, తన కుటుంబంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందని, దానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.
అంతేకాదు, 18 యూట్యూబ్ ఛానళ్ల పేర్లు ఫిర్యాదుల పేర్కొన్నట్టు తెలిపారు. టాలీవుడ్ కు చెందిన ఓ హీరో కార్యాలయం నుంచే తమపై ట్రోలింగ్ జరుగుతుందని విష్ణు ఆరోపించడం సంచలనం రేపింది. తమ కుటుంబ సభ్యులపై ట్రోలింగ్ చేసేందుకు పెయిడ్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారని విష్ణు ఫైర్ అయ్యారు. తమను ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేశారని విష్ణు ఆరోపించారు.
అయితే, తాను వ్యక్తిగతంగా ట్రోలింగ్ ను పట్టించుకోనని, కానీ జవాబుదారీతనం కోసమే కంప్లయింట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు విష్ణు. ఇక, తాను నటించిన జిన్నా చిత్రం ఈనెల 5వ తారీకున విడుదల కావడం లేదని, అక్టోబర్ 21న ఈ సినిమాను విడుదల చేయబోతున్నామని విష్ణు తెలిపారు.