కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు ఇంట్లో రచ్చ రోడ్డున పడింది. ఆస్తులు, విద్యాసంస్థలకు సంబంధించి కుటుంబంలో చోటు చేసుకున్న రగడ.. రచ్చకెక్కింది. తండ్రీకొడుకులు.. తన్నుకునే పరిస్థితికి వచ్చింది. తనను చిన్న కుమారుడు మంచు మనోజ్ చిత్తుచిత్తుగా కొట్టాడంటూ.. కమిలిన గాయాలతో బయటకు వచ్చిన మోహన్‌బాబు.. కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం.. సంచలనంగా మారింది. తనను, తన భార్యను కూడా మనోజ్‌కుమార్ కొట్టారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే.. ఇక్కడే యూటర్న్ తీసుకుంది. ఆస్తుల విషయం ప్రస్తావించినందుకు తండ్రి, తల్లి కలిసి తన ను కొట్టారంటూ.. మంచు మనోజ్.. కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఆయన కూడా గాయాలను సాక్ష్యంగా పేర్కొన్నారు. ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో పోలీసులు ఇరు పక్షాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అయితే.. ఈవ్యవహారం.. అటు కుటుంబంలోనూ.. ఇటు రాజకీయంగాను, సినీ ఫీల్డ్‌లోనూ చర్చనీయాంశం అయింది. కానీ, అటువంటి గొడవ ఏమీ జరగలేదని, ఆధారాలు లేకుండా వార్తలు రాయవద్దని మంచు మోహన్ బాబు పీఆర్ టీం చెప్పింది.
ఈ క్రమంలోనే గాయాలతో ఉన్న మంచు మనోజ్ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీఎక్స్ హాస్పిటల్లో చికిత్స పొందడం చర్చనీయాంశమైంది. కాలికి, మెడ దగ్గర గాయం కావడంతో సతీమణి మౌనికతో కలిసి ఆయన ఆస్పత్రికి వెళ్లారు. మెడ భాగంలో కండరాలపై స్వల్ప గాయమైందని, కుడి కాలు కండరం నొప్పితో మంచు మనోజ్ ఆస్పత్రికి వచ్చారని తెలుస్తోంది. నడవడానికి ఇబ్బంది పడుతూ మనోజ్ ఆస్పత్రికి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎందుకు రగడ!
మోహన్‌బాబు స్వయంకృషితో సంపాయించుకున్న ఆస్తుల గురించి అందరికీ తెలిసిందే. సినీ రంగంలో నే కాకుండా.. శ్రీవిద్య సంస్థలను నెలకొల్పి.. వాటిని యూనివర్సిటీ స్థాయికి చేర్చడంలోనూ ఆయన కీలక భూమిక పోషించారు. ఓ చిన్నపాటి విలన్ వేషాలతో తెరమీదకు వచ్చిన ఆయన.. హీరోగా.. ప్రతినాయ కుడిగా తనకు తిరుగులేనివేదికను ఏర్పాటు చేసుకున్నారు. నిర్మాత తీసిన అనేక సినిమాలు సూపర్ హిట్టయి.. కాసుల వర్షం కురిపించాయి. ఇలా సంపాయించుకున్న ఆస్తుల పంపకాల వ్యవహారం రెండేళ్లుగా వివాదంగానే ఉంది.
అయితే.. ఎప్పుడూ రోడ్డున పడలేదు. ఒకానొక దశలో దాసరి నారాయణరావు కుటుంబంలో తలెత్తిన ఆస్తుల వివాదంలో జోక్యం చేసుకున్నారన్న చర్చ కూడా వచ్చింది. మళ్లీ ఆతర్వాత.. ఎప్పుడూ ఆస్తుల వివాదం తెరమీదికి రాలేదు. అయితే.. పాడికుండ వంటి తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌ను తనకు ఇవ్వాలన్నది మంచు మనోజ్ డిమాండ్ ఉందన్న చర్చ ఉంది. కానీ, ఇది తన పెద్దకొడుకు విష్ణుకు మోహన్‌బాబు.. రహస్యంగా ఇచ్చేశారన్న వాదన కూడా ఉంది.
అందుకే.. ఆ విద్యాసంస్థలో ఏం జరిగినా విష్ణు చూసుకుంటున్నారు. ఇక, కుమార్తె.. మంచు లక్ష్మి కూడా.. ఆస్తుల విషయంలో వాటాల కోసం కోర్టుకు వెళ్లారన్న చర్చ కూడా గత ఏడాది తెరమీదికి వచ్చింది. ఏదేమైనా ఇప్పుడు కుటుంబ వివాదాలు పోలీసు స్టేషన్ వరకు చేరడం సంచలనంగా మారింది.