మంచు కుటుంబ సభ్యులు ఎప్పుడెలా ప్రవర్తిస్తారో.. ఏం మాట్లాడతారో జనాలకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. రెండు రోజుల కిందటే మోహన్ బాబు నందమూరి బాలకృష్ణను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన మీద ప్రశంసల జల్లు కురిపించాడు.
తాను బాలయ్య అల్లుడు నారా లోకేష్ ఓటమి కోసం ప్రచారం చేస్తే.. బాలయ్య అదేమీ మనసులో పెట్టుకోకుండా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో తన కొడుకు విష్ణు గెలుపు కోసం మద్దతిచ్చాడంటూ వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచారు.
ఆ తర్వాతేమో విష్ణు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు మీద విమర్శలు గుప్పించి బాలయ్య నొచ్చుకునేలా చేశాడు.
ఇక మోహన్ బాబు.. చిరంజీవితో ఇన్ని రోజుల స్నేహాన్ని పక్కన పెట్టి మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్‌కు చిరు మద్దతివ్వడంపై కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్న సంగతి తెలిసిందే.
ఓ వైపు మా ఎన్నికల సందర్భంగా విష్ణు, మోహన్ బాబు మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా వ్యవహరించి.. వారిని టార్గెట్ చేస్తుంటే.. అదే సమయంలో మంచు విష్ణు వెళ్లి భీమ్లా నాయక్ సెట్లో పవన్ కళ్యాణ్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది.
దాదాపు గంటసేపు పవన్‌తో మాట్లాడి వచ్చాడు మనోజ్. విష్ణు, మోహన్ బాబు కవ్విస్తుంటే.. ఈ దువ్వుడేంటి మనోజ్ అంటూ సోషల్ మీడియా జనాలు అతణ్ని ప్రశ్నించారు. ఇప్పుడేమో మనోజ్ అయిపోయాడు. విష్ణు వచ్చాడు. మా ఎన్నికలు జరగడానికి ముందు రిపబ్లిక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను విష్ణు తప్పుబట్టడం తెలిసిందే.
అప్పుడలా మాట్లాడి.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాయ్ బలాయ్ కార్యక్రమంలో పాల్గొన్న వీడియోను విష్ణు ట్విట్టర్లో షేర్ చేశాడు. ఈ వేడుకకు విష్ణు సైతం అతిథిగా వెళ్లాడు. ఆ సభలో ముందుగా జనాన్ని చూపించి.. చివర్లో కెమెరాను పవన్ వైపు తిప్పి.. వీడియో ఆఖర్లో కనిపించిన వ్యక్తి ఎవరో చెప్పండి చూద్దాం అంటూ వ్యాఖ్య జోడించాడు.
కొందరు మెగా అభిమానులు దీనిపై సానుకూలంగానే స్పందించినా.. చాలామంది ఓవైపు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఈ దువ్వుడేంటి మంచు బ్రదర్స్ అంటూ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.
Can you guess whose at the end of the video? 💪🏽 pic.twitter.com/FJyMiWRA2T
— Vishnu Manchu (@iVishnuManchu) October 17, 2021