టీడీపీకి కంచుకోట వంటి బెజవాడలో వైసీపీ రెండు నియోజకవర్గాల్లో పాగా వేసింది. సెంట్రల్ నియోజకవ ర్గం లో పాతిక ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణు. పశ్చి మ నియోజకవర్గంలో 7 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కారు వైశ్య కమ్యూనిటీకి చెందిన వెలంపల్లి శ్రీనివాస్. వీరిలో వెలంపల్లి.. మంత్రి అయ్యారు. ఇక, విష్ణుకు బ్రాహ్మణ కార్పొరేషన్ పదవిని అప్ప గించారు. దీని వెనుక సీఎం జగన్ చాలానే ఆశలు పెట్టుకున్నారు. టీడీపీకి బలమైన నియో జకవర్గంగా ఉన్న సెంట్రల్లోను అటు ఇటుగా ఉన్న పశ్చిమలోను వైసీపీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్తారని అనుకున్నారు.
అయితే.. వీరిద్దరూ ఏమేరకు ఈ ఆశలు నెరవేరుస్తున్నారు? అంటే.. ప్రశ్నార్థకంగానే మారింది పరిస్థితి. ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరుపైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏడాదిన్నర కాలంలోకలిసి కూర్చుని విజయవాడ సమస్యలపై చర్చించిన పాపాన పోలేదు. అంతేకాదు.. విష్ణు సిఫారసులను మంత్రి గా వెలంపల్లి అనేకసార్లు తిరస్కరించారు. రెండు కేంద్రాలుగా ఏర్పడి రాజకీయం చేసుకుంటున్నారు. పైకి మాత్రం అంతాబాగానే ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. చూసే వారికి కూడా అలానే అనిపిస్తోంది. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనిస్తే.. మాత్రం ఇరువురు నేతల మధ్య ఎక్కడా సఖ్యత కనిపించడం లేదు.
రాష్ట్రంలో కీలకమైన తిరుమల ఆలయ బోర్డు తర్వాత స్థానం దుర్గమ్మ ఆలయానికే ఉంది. ఈ విషయంలో పట్టుబట్టి.. తనకు అనుకూలమైన విజయవాడ కాంగ్రెస్ మాజీ చీఫ్ పైలా సోమినాయుడుకు దుర్గగుడి పాల క మండలి చైర్మన్ పదవిని ఇప్పించుకు న్నారు విష్ణు. ఇక, మిగిలిన సభ్యుల్లో సగం మందిని వెలంపల్లి తన కనుసన్నల్లో నియమించారు. ఇంత వరకు బాగానే ఉంది. కొన్నాళ్ల కిందట.. దుర్గగుడి బోర్డు మెంబర్ తన కారులో తెలంగాణ నుంచి మద్యం తరలిస్తూ.. పోలీసులకు చిక్కారు. దీంతో ఆమెను తొలగించాలనే డిమాండ్లు పైకి వచ్చాయి. కానీ, ఆమె వెలంపల్లి కూటమి సభ్యురాలు. దీంతో విష్ణు.. పరోక్షంగా ఓ వర్గం మీడియాకు లీకులు ఇచ్చి.. ఆమెపై తీవ్రస్థాయిలో వ్యతిరేక ప్రచారం చేయించారు.
ఇది మరింతగా ఇరువురి నేతల మధ్య సంబంధాలను డైల్యూట్ చేసింది. ఇక, ఇప్పుడు ఆమె తొలగించి నా.. తనకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకునేందుకు విష్ణు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు వెలంపల్లి పైస్థాయిలో చక్రం తిప్పుతున్నారు. ఇదో వివాదంగా మారింది. ఇక, స్థానిక ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా ఎవరు ఉండాలనే విషయంలోనూ వీరిద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ సారి మహిళకు దక్కే అవకాశం ఉండడంతో ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీంతో ఇరువురు నాయకులు పార్టీని వదిలేసి.. వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు, ఆధిపత్య పోరులో రాటుదేలుతున్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య రాజకీయ రగడ పెరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.