దక్షిణాది సినిమా గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ‘మౌనరాగం’తో మొదలుపెడితే ఆయన అందించిన క్లాసిక్స్ రెండంకెల సంఖ్యలో ఉన్నాయి. మణిరత్నం ఎప్పుడో కానీ దర్శకుడిగా విఫలం కారు. ప్రేక్షకులకు రుచించని సినిమాను తీయరు. ప్రేక్షకుల స్థాయిని.. అలాగే ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడాయన.
మణిరత్నంతో ఒక్క సినిమా అయినా చేయాలని తహతహలాడే స్టార్లు ఎందరో. మన తెలుగు స్టార్లకు కూడా ఆ కోరిక ఉంది. ఐతే అక్కినేని నాగార్జున ఒక్కడికే మణిరత్నంతో పని చేసే అవకాశం దక్కింది. మణితో నాగ్ చేసిన ‘గీతాంజలి’ ఎంత గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుందో తెలిసిందే.
నాగ్ కూడా మళ్లీ మణిరత్నంతో మరో సినిమా చేయలేకపోయారు. ఐతే తర్వాతి తరంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు మణిరత్నంతో సినిమా చేసే అవకాశం లభించినట్లే కనిపించింది కానీ.. ఆ ప్రాజెక్టు అనివార్య కారణాలతో కార్యరూపం దాల్చలేదు.
మహేష్, మణిరత్నం కలిసి ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా చేయాలని చాలా ఏళ్ల కిందట అనుకున్నారు. మహేష్, మణి కలిసి పని చేయడమే ఆలస్యం అనుకున్నాక ఆ ప్రాజెక్టుకు పక్కకు వెళ్లిపోయింది. ఇప్పుడు అదే కథను వేరే నటీనటులతో తీస్తున్నాడు మణి.
తన నిర్మాణంలో తెరకెక్కిన ఆంథాలజీ ఫిలిం ‘నవరస’ టీజర్ రిలీజ్ సందర్భంగా మణిరత్నం తెలుగు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహేష్ సినిమా ప్రస్తావన వచ్చింది. దాని గురించి అడిగితే.. ‘‘మహేష్, నేను కలిసి మాట్లాడుకున్న మాట నిజమే. కానీ ఆ సమయంలో అది వర్కవుట్ కాలేదు.
అంతలోనే మేం వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయాం. ఏదైనా సరే.. కథే నిర్ణయించాలి. త్వరలోనే తెలుగు సినిమా చేయాలనుకుంటున్నా’’ అని మణిరత్నం తెలిపారు. ఇక ప్రస్తుతం చేస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ గురించి మణిరత్నం స్పందిస్తూ.. ఈ సినిమా ఇప్పటి వరకు 25 శాతం పూర్తయిందని, మెజారిటీ షూటింగ్ హైదరాబాద్లోనే జరిగిందని.. తాను ఇప్పటిదాకా తీసిన అన్ని సినిమాల కంటే ఇది పెద్ద ప్రాజెక్టు అని మణిరత్నం అన్నారు.