ఉన్నత స్థానాల్లో ఉన్నవారు.. అందునా ప్రజాజీవితంలో ఉన్న వారు ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తారు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉంటారు. అందుకు భిన్నంగా మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే మీద వస్తున్న ఆరోపణలు.. అందుకు ఆయన స్పందించి తీరు సంచలనంగా మారింది. తనపై మంత్రి అత్యాచారం చేసినట్లుగా 38 ఏళ్ల మహిళ ఆరోపణలు చేయటం తెలిసిందే. దీనిపై స్పందించిన సదరు మంత్రి సంచలన విషయాల్ని వెల్లడించారు.
తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ చెబుతున్నవన్ని అసత్యాలని చెప్పారు. అయితే.. ఆమె సోదరి..తాను రిలేషన్ లో ఉన్నామని చెప్పారు. ‘వారిద్దరు అక్కా చెల్లెళ్లు. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజాలని ప్రయత్నిస్తున్నారు. వారిద్దరి మీదా నేను గత నవంబరులోనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాపైన ఆరోపణలు చేసిన మహిళ సోదరితో 2003 నుంచి సంబంధం ఉంది. మాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు’’ అని పేర్కొన్నారు.
తమ మధ్య ఉన్న సంబంధం గురించి కుటుంబ సభ్యులకు కూడా తెలిపానని చెప్పిన ఆయన.. వారు కూడా అంగీకరించినట్లు చెప్పారు. అంతా బాగుందని అనుకున్న వేళలో తనపై ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రిగారి వ్యాఖ్యల అనంతరం మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కొత్త డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. మంత్రివర్గం నుంచి మంత్రిని తొలగించాలన్నారు. దీనికి సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు.
ఇదిలా ఉంటే.. మంత్రి మీద ఆరోపణలు చేసిన మహిళ తరపు లాయరు మరిన్ని వ్యాఖ్యలు చేశారు. బాధితురాలికి మంత్రికి 1997 నుంచి పరిచయం ఉందన్నారు. తొలుత బాలీవుడ్ సింగర్ గా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి.. ఆమెతో పరిచయాన్ని పెంచుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో 2008లో తొలిసారి అత్యాచారం చేశాడన్నారు. ఆ తర్వాత నుంచి ఆమెపై వరుసగా లైంగిక దాడి చేస్తూనే ఉన్నాడని చెప్పారు.
ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ధనుంజయ్ ను సదరు మహిళ కోరితే అందుకు ఆయన నో చెప్పారన్నారు. అంతేకాదు.. తమ విషయాన్ని బయటకు వెల్లడిస్తే.. ఆమెకు సంబంధించిన వీడియోల్ని విడుదల చేస్తానని బెదిరించారని పేర్కొన్నారు. అందుకే అతడిపై కంప్లైంట్ చేసినట్లుగా పేర్కొన్నారు. ఇప్పటివరకు మంత్రి ధనుంజయ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.