- గత ప్రభుత్వంతో ట్రైటాన్ సోలార్ ఒప్పందం
- 727 కోట్లతో ‘బ్యాటరీ’ ప్లాంటు ఏర్పాటుకు రెడీ
- ఎన్నికల తర్వాత పట్టించుకోని వైసీపీ సర్కారు
- ఇప్పుడు తెలంగాణలో భారీ పెట్టుబడి పెడుతున్న అమెరికా సంస్థ
- పాతిక వేల మందికి ఉపాధి అంచనా
జగన్ ప్రభుత్వం తీరుతో భారీ పరిశ్రమలన్నీ పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. టీడీపీ హయాంలో వచ్చిన సంస్థలన్నిటికీ సర్కారు పొగపెడుతోంది. అమెరికాకు చెందిన ట్రైటాన్ సోలార్ సంస్థ కూడా ఇప్పుడా కోవలో చేరింది. ఇది ప్రింటబుల్ సోలార్ సెల్స్, ప్రింటెడ్ లైటింగ్, ప్రింటెడ్ బ్యాటరీల తయారీలో అగ్రశ్రేణి సంస్థ.
చంద్రబాబు హయాంలో రూ.727 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లో సోలార్ బ్యాటరీ తయారీ ప్లాంటు నిర్మించేందుకు ముందుకొచ్చిన ఈ కంపెనీ.. ఇప్పుడు రాష్ట్రానికి గుడ్‌బై చెప్పి.. తెలంగాణలో విద్యుత వాహనాల యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. దీనిపై ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
దీనివల్ల రూ.2,100 కోట్ల పెట్టుబడితో దాదాపు 25వేల మందికి ఉపాధి లభించే అవకాశముంది. అంటే ఆ మేరకు ఆంధ్రకు నష్టం జరిగిందన్న మాటే కదా! వాస్తవానికి ఈ సంస్థ 2018 సెప్టెంబరు 29వ తేదీన ఆంధ్ర సర్కారుతో ఎంవోయూ కుదుర్చుకుంది.
విశాఖపట్నం లేదా చిత్తూరు జిల్లాలో సోలార్ బ్యాటరీ ప్లాంటు పెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో నానో, లిథియం పాలిమర్ టెక్నాలజీతో బ్యాటరీల తయారీ చేస్తామని ప్రకటించింది. దశలవారీగా 200 మెగావాట్ల వార్షిక సామర్థ్యాన్ని సాధిస్తామని తెలిపింది. ఆ తర్వాత ఎన్నికల హడావుడి మొదలై.. జగన్ అధికారంలోకి వచ్చారు. ట్రైటాన్ సోలార్ ఒప్పందాన్ని పట్టించుకోలేదు. దీంతో రాష్ట్రాన్ని ట్రెటాన్ కూడా మరచిపోయింది.
ఇప్పుడు తెలంగాణలో విద్యుత వాహనాల ప్లాంటు ఏర్పాటు చేస్తున్న ట్రెటాన్ ఈవీ సంస్థ దీని అనుబంధ సంస్థే. ఏపీలో ట్రైటాన్ సోలార్ ప్లాంటు ఏర్పాటుపై అడుగు ముందుకు పడి ఉంటే.. విద్యుత వాహనాల ప్లాంటును కూడా ఇక్కడే ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యమిచ్చేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సర్కారు అలసత్వంతో ఒక భారీ పెట్టుబడిని కోల్పోయినట్లయిందని పేర్కొంటున్నాయి.
రిలయన్స్, హెచ్‌సీఎల్‌ల ఊసేదీ?
ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో తన కార్యాలయం ఏర్పాటుకు టీడీపీ హయాంలో ఒప్పందం కుదుర్చుకుంది. అనుకున్నది అనుకున్నట్లు కార్యక్రమాలు ప్రారంభించి వందల మందికి ఉద్యోగాలు కల్పించింది.
రెండో దశలో అమరావతిలో రూ.350 కోట్ల పెట్టుబడితో 3,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. హెచ్‌సీఎల్ సంస్థ కేసరపల్లిలో చేపట్టిన ప్రాజెక్టులు, పెట్టిన పెట్టుబడి, ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య చూస్తే.. అమరావతిలోనూ కచ్చితంగా చెప్పింది చెప్పినట్లుగా చేసేదని అర్థమవుతుంది.
వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించకుండా, రాజధాని ప్రణాళికలను అలాగే అమలు చేసి ఉంటే… అక్కడ ఈ పాటికి హెచ్‌సీఎల్ కార్యాలయం ప్రారంభమై ఉండేదని అంటున్నారు. మరోవైపు రిలయన్స్ ఇండ స్ర్టీస్ తిరుపతి సమీపంలో ప్రారంభిస్తామన్న సెజ్‌తోపాటు అమరావతిలోను ఒక భారీ సెజ్‌ను పెట్టేందుకు చర్చలు జరిగాయి.
చైనాలోని అతి పెద్ద సెజ్‌ల మాదిరిగా ఇక్కడ కూడా ఒకేచోట లక్షమందికి ఉపాధి కల్పించేలా ఈ సెజ్ పెట్టాలని భావించారు. అయితే ఇప్పుడు తిరుపతిలో పెట్టేందుకు కుదిరిన ఎంవోయూ నుంచి రిలయన్స్ వెనక్కి వెళ్లిపోయింది. ఇక అమరావతి అంశాన్ని రాష్ట్రప్రభుత్వం వివాదాస్పదం చేయడంతో… ఇక్కడకూ రాకుండా పోయింది.
ఇలా గత సర్కారు హయాంలో కుదిరిన ఒప్పందాలను కార్యాచరణలోకి తీసుకురాకుండా జగన్ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని ఫలితంగా రాష్ట్ర యువత ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు పరుగులు తీయక తప్పడంలేదు. మరోవైపు… రాష్ట్రం కూడా ఆదాయాన్ని కోల్పోతోంది. పారిశ్రామికంగా కుదేలవుతోంది.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.300కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ‘బెస్ట్ బ్యాటరీ’ సంస్థ ఒప్పందం చేసుకుంది. చిత్తూరు జిల్లాలో తన యూనిట్ పెట్టేందుకు సిద్ధమైంది. కానీ… సర్కారు మారిన తర్వాత తన నిర్ణయం మార్చుకుంది. తెలంగాణ రాష్ట్రానికి తరలివెళ్లిపోయింది.
ఏపీకి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గుడ్‌బై
ప్రపంచంలోని 500 గొప్ప కంపెనీల్లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఒకటి! ఈ సంస్థ కొన్ని రూ.లక్షల కోట్ల పెట్టుబడి వ్యవ హారాలను నిర్వహిస్తుంది. ఇంత గొప్ప కంపెనీ విశాఖకు వస్తే.. అక్కడ పారిశ్రామిక వాతావరణం మారిపోయేది. మరిన్ని కంపెనీలు వచ్చేందుకు కారణమయ్యేది. ఐటీ అభివృద్ధికి ఉపకరించేది.
దీంతో అప్పట్లో ప్రత్యేక చొరవ తీసుకుని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్తో మాట్లాడి విశాఖకు వచ్చేందుకు నాటి సీఎం చంద్రబాబు ఒప్పించారు. సంస్థ సీఈవో జెన్నీ జాన్సన్ స్వయంగా వచ్చి.. విశాఖపట్నంలో కార్యాలయం నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నారు. భూమిపూజ కూడా చేశారు.
హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ రాక ఎంత కీలకమో… నవ్యాంధ్రలో విశాఖకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అంత ముఖ్యమని అప్పట్లో అంతా భావించారు. మరిన్ని ఐటీ, ఇతర అనుబంధ కంపెనీల రాకకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని ఆశించారు. ఈ సంస్థకు విశాఖలోని మధురవాడ ఐటీ హిల్స్‌పై స్థలం కేటాయించారు.
అప్పట్లో రచ్చ చేసి.. ఆపై!
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రాకపై అప్పట్లో విపక్షంలో ఉన్న వైసీపీ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. అది ఫ్రాడ్ కంపెనీ అని విమర్శలు గుప్పించింది. ఎంతో విలువైన 40 ఎకరాల భూమి ఎందుకిచ్చారని నిలదీసింది. ఆ తర్వాత వైసీపీయే అధికారంలోకి వచ్చింది.
జగన్ సీఎం అయిన రెండు నెలల్లోనే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సీఈవో రాష్ట్రానికి వచ్చి ప్రభుత్వంతో మాట్లాడారు. ‘40 ఎకరాలు ఇవ్వం, పాతిక ఎకరాలే ఇస్తాం! గత ప్రభుత్వం కేటాయించినట్లుగా రూ.32 లక్షలకు కేటాయించం. ఎకరాకు 64 లక్షలు ఇవ్వాలి’ అంటూ కొత్త ప్రభుత్వం కొత్త లెక్కలు చెప్పింది.
ప్రభుత్వ పెద్దల వైఖరి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు నచ్చకపోవడంతో ఆ ప్రభావం మరికొన్ని విదేశీ సంస్థలపైనా పడింది. పెట్టుబడులకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జగన్ ప్రభుత్వం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు లేఖ రాయడం విశేషం. ‘మా రాష్ట్రానికి రండి. విశాఖలో మీ క్యాంపస్ పెట్టండి’ అని ఆహ్వానించింది. అయితే సదరు కంపెనీ ఆంధ్రప్రదేశ్‌కు రాకూడదని నిర్ణయం తీసుకుంది.
విశాఖలో క్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. జగన్ పార్టీ నేతలు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్పై ఫ్రాడ్ కంపెనీ ముద్రవేశారు. కానీ సీఎం జగన్‌కు అందులో 9 కోట్ల షేర్లు ఉన్న విషయం బయటపడింది.