తమిళ స్టార్ హీరో సూర్య ఆదాయపు పన్నుకు సంబంధించిన కేసు మద్రాస్ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. (2007-2009) రెండు ఆర్థిక సంవత్సరాలకుగాను ఆదాయపు పన్నుపై వడ్డీ మినహాయింపు కోరుతూ సూర్య మద్రాస్ హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు సూర్యకు షాకిచ్చింది. ఆ పిటిషన్ ను కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
2010లో సూర్య ఇంటిలో ఐటీ సోదాలు జరిగాయి. సూర్య ఆస్తులు లెక్కగట్టిన అధికారులు…సూర్య ఇంకా రూ.3.11 కోట్లు పన్ను చెల్లించాలని నోటీసులిచ్చారు. ఈ వ్యవహారంపై సూర్య ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో ఆదాయపు పన్ను శాఖ ఉత్తర్వులను సవాలు చేశారు. ఇక్కడ సూర్యకి నిరాశ తప్పలేదు. ఆదాయపు పన్ను శాఖ చెప్పిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ప్రకటించడానికి ట్రిబ్యునల్‌కి మూడు సంవత్సరాలు పట్టింది.
అయితే, సూర్య పన్ను మదింపు కోసం వడ్డీ మినహాయింపు కోరుతూ 2018 లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, అప్పట్లో మద్రాస్ హైకోర్టులో సూర్యకు చుక్కెదురైంది. తాజాగా హైకోర్టులో ఈ పిటిషన్ పై మరోసారి విచారణ జరిగింది. జస్టిస్ ఎస్ఎం సుబ్రమణ్యం ఐటి శాఖ వాదన విన్న తర్వాత సూర్య వేసిన పిటిషన్ కొట్టివేసింది. దీంతో సూర్య ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ చెప్పిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సూర్య ఈ తీర్పును సవాల్ చేస్తారా లేక డబ్బు చెల్లిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.