ప్రముఖ నటి కస్తూరి శంకర్ తెలుగువారిపై నోరు జారి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. బ్రాహ్మణుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఇటీవల చెన్నైలో హిందూ మక్కల్ కట్చి నిర్వహించిన కార్యక్రమానికి కస్తూరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగువారిపై అవమానకర వ్యాఖ్యలు చేయడం వివాస్పదం అయింది. ఆ తర్వాత తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ కస్తూరి క్షమాపణ చెప్పినా.. అక్కడి తెలుగువారు మాత్రం వెనక్కి తగ్గలేదు.
కస్తూరిపై తమిళనాడులోని చెన్నై, మదురై తో సహా పలుచోట్ల తెలుగు సంఘాలు ఫిర్యాదు చేశాయి. చెన్నైలోని ఎగ్మోర్ పోలీస్ స్టేషన్ లో తెలుగు సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు కస్తూరిపై 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ భయంతో కస్తూరి రెండు రోజుల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఫోన్ ను కూడా స్విచ్ఛాఫ్ చేయడంతో.. ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
ఇక ఇదే సమయంలో కస్తూరి తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మధురై కోర్టును ఆశ్రయించిగా.. అక్కడ ఆమెకు బిగ్ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్ పై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం.. కస్తూరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు-తమిళులను వేరు చేసి ఎలా మాట్లాడతారని చురకలు వేసింది. అంతేకాకుండా ఆమె దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టి వేసింది. దీంతో రేపోమాపో కస్తూరి అరెస్ట్ ఖాయమనే చర్చలు ఊపందుకున్నాయి.
కాగా, తమిళనాడులోని స్థానిక బ్రహ్మణుల సమ్మేళనానికి హాజరైన కస్తూరి.. తెలుగువారికి తక్కువ చేసి అనుచిత వ్యాఖ్యలు చేసింది. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి ఆంధ్ర నుంచి వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమను తాము తమిళులుగా చెప్పుకుంటున్నారని కస్తూరి హేళన చేశారు. దాంతో తెలుగు సంఘాలు మరియు ప్రముఖలు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. కస్తూరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.