సోషల్ మీడియా పుణ్యమా అని నేడు చిన్న వాళ్లు కూడా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వారిని నోటికొచ్చినట్టు విమర్శిస్తున్నారు. గతంలో మీడియా పరిమితంగా ఉండటం.. ఎవరైనా బాధ్యత లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే.. వారి మాటలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా.. వాటిని పక్కన పెట్టేసేది మీడియా. ఈ తీరు వల్ల కొంత లాభం జరిగినట్లే..నష్టం కూడా జరిగింది. కానీ.. సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ఎవరికి వారు తమకు తోచింది వీడియో రూపంలోనో.. మెసేజ్ రూపంలోనో సోషల్ మీడియాలో షేర్ చేయటం.. అది కాస్తా వైరల్ కావటం లాంటివి తరచూ జరుగుతున్నాయి. అందరూ అందరిని మెప్పించలేరు. మంచి చెబితే మనసుకు ఎక్కకపోవచ్చు కానీ.. చెడు మాటలకు ఇట్టే ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. దరిద్రపుగొట్టు వ్యాఖ్యలతో లేనిపోని ఛండాలం మెదడులోకి ఎక్కిన తర్వాత అది తిన్నగా ఉండదు కదా. రకరకాల వికారాల్ని తెచ్చి పెడుతుంది.
అలాంటి ఒక ఉదంతానికి సంబంధించి తాజాగా ఉన్నత న్యాయస్థానం కాసింత ఘాటుగా రియాక్టు అయ్యింది. సీఎం స్టాలిన్ మీద విమర్శలు చేయటాన్ని ఆపాలని మద్రాసు హైకోర్టు బెంచ్ మధురై ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే.. చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఇంతకూ జరిగిందేమంటే.. మదురైకు చెందిన సాట్టై మురుగన్ తరచూ ముఖ్యమంత్రి స్టాలిన్ మీద ఆరోపణలు చేస్తుంటారు. ఘాటు విమర్శలు చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెయిల్ కోరుతూ అతడు మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ తాజాగా న్యాయమూర్తి జస్టిస్ పుగళేంది ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రిగా స్టాలిన్ తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తున్నారని వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి.. ‘అభినందించకపోయినా ఫర్లేదు కానీ ఆయన్ను విమర్శించటాన్ని కోర్టు సహించదు. తమిళనాడు ప్రభుత్వం ఏ తప్పులు చేస్తే గుర్తించారు?’ అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు.. కోర్టుకు ఇచ్చిన హామీని మీరి.. ఇకపై ఒక్క మాట మాట్లాడినా బెయిల్ రద్దు చేస్తాంటూ క్లియర్ వార్నింగ్ ఇచ్చేశారు.