`మ్యాడ్` చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన `మ్యాడ్ స్క్వేర్` శుక్రవారం గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ కు కళ్యాణ్ శంకర్ డైరెక్టర్ కాగా.. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించారు. భీమ్స్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది. ఫస్టాఫ్ ఫుల్ గా నవ్వించినా.. సెకండాఫ్ మాత్రం కొంచెం విసిగించిందన్న రివ్యూలు వచ్చాయి. అయితే ప్రధాన పాత్రలు, లడ్డూ పెళ్లి ట్రాక్, కథను వినోదాత్మకంగా నడిపిన తీరు హైలెట్గా నిలిచాయని.. మొత్తంగా సినిమా ఆకట్టుకుందని చాలా మంది అభిప్రాయపడ్డారు.
టాక్ గురించి పక్కన పెడితే.. ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద మ్యాడ్ స్క్వేర్ మాస్ జాతర సృష్టించింది. యూత్ ఫుల్ కంటెంట్ కావడంతో యువతను ఈ చిత్రం విశేషంగా ఆకర్షించింది. దాని ఫలితంగా ఈ సినిమా అంచనాలను మించి పోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. తొలి రోజు ఏపీ మరియు తెలంగాణలో మ్యాడ్ స్క్వేర్ మూవీకి రూ. 6.04 కోట్ల షేర్, రూ. 9.85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
ఓవర్సీస్ లో రూ. 3.65 కోట్ల రేంజ్ లో వసూళ్లను కొల్లగొట్టి దుమ్ముదులిపేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మ్యాడ్ 2 చిత్రానికి రూ. 10.54 కోట్ల షేర్, రూ. 19.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 22 కోట్లు. అయితే మరొక రూ. 11.46 కోట్ల షేర్ వస్తే మ్యాడ్ స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఎలాగో లాంగ్ వీకెండ్ కాబట్టి.. మిగతా టార్గెట్ ను సినిమా ఈజీగా అందుకుంటుందో అనడంలో ఎటువంటి సందేహం లేదు.