ఏపీ కేబినెట్ లో మార్పులు చేర్పులకు సీఎం జగన్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11న కొత్త మంత్రివర్గం కొలువుదీరనుండగా..ఇప్పటికే పలు పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆల్రెడీ కొత్తగా మంత్రి పదవులు దక్కించుకునేవారికి సీఎం జగన్ హిట్ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో, పాత కేబినెట్ లోని చాలామంది మంత్రులు తమ అసహనాన్ని కక్కలేక మింగలేక ఉన్నారని తెలుస్తోంది. ఇక, నారాయణ స్వామి వంటి వారైతే తమకు అసంతృప్తి లేదంటూనే అసహనం వెళ్లగక్కుతున్నారు.
ఇక, తాజాగా మంత్రి వర్గంలో చోటు ఆశించి భంగపాటుకు గురయ్యామన్న భావనలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదన చెందుతున్నారట. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో జగన్ కు అసమ్మతి సెగ తగిలినట్లు కనిపిస్తోంది. ఆల్రెడీ చక్కర్లు కొడుతున్న తొలి జాబితాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు లేకపోవడంతో పల్నాడు వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన కొద్ది పేర్లలో పీఆర్కే పేరుంటుందా లేదా అన్న ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు.
4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన పీఆర్కేకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ పలువురు ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాచర్లలోని మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్న కౌన్సిలర్లు పిన్నెల్లికి మంత్రిపదవి ఇవ్వకుంటే…తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఇక, మాచర్ల మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు సమావేశమై ఇదే తరహా యోచనలో ఉన్నారు.
పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని వారు అంటున్నారు. వైసీపీలో మొదటినుంచీ జగన్ వెన్నంటి నడిచిన పీఆర్కేకు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు మంత్రి పదవి ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో మరే నియోజకవర్గంలో లేనట్లుగా వైసీపీని ఏకగ్రీవంగా గెలిపించిన పీఆర్కేకి మంత్రి పదవి దక్కాల్సిందేనంటున్నారు. ఈ క్రమంలోనే పిన్నెల్లి మాచర్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరి, పిన్నెల్లికి తుది జాబితాలో చోటు దక్కిందా లేదా అన్నది తేలాలంటే మరి కొద్దిగంటలు వేచి చూడక తప్పదు.