మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ కొడాలి నాని కి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. గత ప్రభుత్వం లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొడాలి నాని చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కావు. ప్రస్తుతం నాని అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. నిజానికి ఈపాటికే కొడాలి నాని అరెస్ట్ అయ్యి ఉండాలి. కానీ గుండెపోటు పేరుతో ఆయన హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడంతో తృటిలో తప్పించుకున్నారు. ముంబైలో ట్రీట్మెంట్ చేయించుకుని కొద్ది రోజుల క్రితం కొడాలి హైదరాబాద్ కు వచ్చారు. కోలుకున్నారన్న ప్రచారమూ జరుగుతుంది.
అయితే సడెన్‌గా మెరుగైన వైద్యం పేరుతో కొడాలి నాని అమెరికా వెళ్లే యోచనలో ఉన్నట్టు వార్తలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే కొడాలి నానిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఇక్కడే ఉంటే సేఫ్ కాదని భావించిన కొడాలి నాని అరెస్ట్ నుంచి రక్షణ కోసం అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుండడంతో.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు రాష్ట్ర డిజిపికి ఫిర్యాదు చేశారు.
విజిలెన్స్ విచారణ జరుగుతున్న తరుణంలో నాని విదేశాలకు వెళ్లకుండా ఆపాలని, తక్షణమే ఆయన పాస్‌పోర్ట్ ను స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ కొడాలి నాని పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక నోటీసుల ప్రకారం విమానాశ్రయాలు, పోర్ట్స్, మరియు ఇతర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అధికారులు అప్రమత్తం అయ్యారు. కొడాలి నాని దేశం విడిచి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. దీంతో నాని అమెరికా ప్లాన్ ఆల్మోస్ట్ ఫ్లాప్ అయినట్టే చెప్పుకోవచ్చు.