వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, టీడీపీ నేతలు `బూతుల మంత్రి`గా పిలుచుకున్న గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని.. కాబట్టి.. ఆయనను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా ఎస్పీ.. సీఐడీ అధికారులకు శుక్రవారం లేఖ సంధించారు. దీనిలో కొడాలి నాని చేస్తున్న ప్రయత్నాలను ఆయన పూస గుచ్చినట్టు వివరించారు.
ప్రస్తుతం కొడాలి నాని తన నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలు, మట్టి తవ్వకాలు, కోడి పందేల పేరుతో నిర్వహించిన క్యాసినో క్లబ్బులు.. దోచుకున్న వందల కోట్ల వ్యవహారంపై సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి వీటిలో ఆయనను ఎప్పుడో అరెస్టు చేయాల్సి ఉంది. కానీ, అనారోగ్య కారణాలతో నాని హైదరాబాద్, బెంగళూరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుటుండడంతో పోలీసులు మౌనంగా ఉన్నారు.
కానీ, ఆయా అంశాలపై మాత్రం విచారణ జోరుగానే సాగిస్తున్నారు. ఈ సమయంలో ఏమాత్రం కొడాలి నానికి అనారోగ్యం తగ్గినా.. ఆయన వెంటనే విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందని కృష్ణాజిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ప్రస్తుతం గుడివాడ సహా.. హైదరాబాద్, బెంగళూరులో నానీకి ఇళ్లు ఉన్నాయని.. గుడివాడ అడ్రస్‌తో పాస్ పోస్టు ఉన్నా.. దానిని సీజ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరుల్లోని నివాసాల అడ్రస్ తో కొత్తగా ఆయన పాస్ పోర్టును దక్కించుకునే అవకాశం ఉంటుందని.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.
ఇక, నానీ వ్యవహారాన్ని మరింత జాగ్రత్తగా పరిశీలించాలని టీడీపీ నాయకులు కూడా డీజీపీ గుప్తాకు లేఖ రాశారు. ఆయన విదేశాలకు పారిపోయేందుకు అవకాశం ఉందని.. కాబట్టి.. ఆయనను విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవాలని కోరారు. తాజాగా ఎస్పీ లేఖతో అప్రమత్తమైన సీఐడీ.. నానీకి మరో పాస్ పోర్టు లభించకుండా.. లేదా.. ఆయన విదేశాలకు వెళ్లకుండా.. చూడాలని కోరుతూ.. లుక్ ఔట్ నోటీసులు జారీ చేయించే పనిలో పడింది.