టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపటి నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా టీడీపీ నేతలతో భేటీ అయిన లోకేష్ తన నిర్ణయం మార్చుకున్నారు. వారి సలహా మేరకు పాదయాత్రను వాయిదా వేశారు. అక్టోబరు 3న సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనల నేపథ్యంలో లాయర్లతో చర్చించేందుకు లోకేష్ ఢిల్లీలో ఉంటే బాగుంటుందని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో, త్వరలోనే పాదయాత్ర మొదలుబెట్టే తేదీని లోకేష్ ప్రకటించనున్నారు. ఇటీవల జరిగిన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో ఈ నెల 29 నుంచి పాదయాత్ర మొదలుబెట్టాలని లోకేష్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
ఇక, ఏపీలో మహిళలు పేదరికంతో బాధపడుతున్నారని, వారు అనుభవిస్తున్న పరిణామాలను చూసి తీవ్ర కలత చెందానని లోకేష్ అన్నారు. బలవంతంగా వ్యభిచార కూపంలోకి మహిలలు నెట్టబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ తొలి స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యభిచారం కారణంగా బాలికలు యుక్త వయసులోనే గర్భవతులు అవుతున్నారని కలత చెందారు. దీనిపై పోలీసులు దృష్టి సారించడం లేదని, ప్రతిపక్షాల గొంతు నొక్కే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారని విమర్శించారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీలో 12.6 శాతం మంది టీనేజ్ యువతులు గర్భం దాలుస్తున్నారని, జాతీయ సరాసరి శాతం 6.8 శాతంగా ఉందని చెప్పారు.