ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో రాజకీయాలు బుధవారం నుంచి మరింత వేడెక్కనున్నాయి. వాస్తవానికి ఇప్పటి వరకు టీడీపీ వర్సెస్ వైసీపీ.. వైసీపీ వర్సెస్బీజేపీ అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్న ప్పటికీ.. బుధవారం నుంచి దాదాపు నెల రోజుల పాటు ఈ పొలిటికల్ హీట్ ఠారెత్త నుందనే అంచనాలు వస్తున్నాయి. దీనికికారణం.. బుధవారం నుంచి కడప జిల్లాలో టీడీపీ యువనాయకుడు నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది.
ఏప్రిల్ 13 నుంచి మంగళవారం వరకు.. యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలో జరిగింది. డోన్ నియోజక వర్గం డి.రంగాపురం గ్రామంలో ప్రారంభమైన ఈ యాత్ర 41 రోజుల పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగిం ది. జిల్లాలో 14 నియోజకవర్గాలు, 45 మండలాలు, 281 గ్రామాల మీదుగా 507 కిలో .మీటర్ల మేర నడిచారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆళ్లగడ్డ నియోజకవర్గ కేంద్రంలోని చిన్నకందుకూరు గ్రామం వద్ద.. కర్నూలు జిల్లాలో పాదయాత్ర ముగిసింది.
ఈ క్రమంలో కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సుద్దుపల్లెలోకి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇదిలావుంటే.. తనను కుటుంబ సభ్యుడి మాదిరిగా ఆదరించి ఆప్యాయత కనబరచిన కర్నూలు ప్రజలకు నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా టీడీపీ నాయకులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. అదే సమయంలో కడప జిల్లా టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. వీరిలో జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జ్ భూపేశ్‌రెడ్డి, కడప జిల్లా ముఖ్య నేతలు శ్రీనివాసరెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, బీటెక్ రవి, గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్, వికాస్ హరికృష్ణ తదితరులు ఉన్నారు.
మంటలు ఖాయం!
ఇప్పటి వరకు నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ..చేసిన ప్రసంగాలు.. వేసిన డైలాగులు ప్రజల్లోకి బాగానే వెళ్లాయి. ఒకరిద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ధర్నాలు కూడా చేశారు. ఇక, తాజాగా కడపలోకి పప్రవేశించడం.. ఇది సీఎం జగన్ సొంత జిల్లా కావడంతో నారా లోకేష్ చేసే ప్రసంగాలు ఇక్కడ రాజకీయ కాక రేపుతాయని అంటున్నారు పరిశీలకులు. మరి ఏరేంజ్‌లో ఇక్కడ వేడి పుడుతుందో చూడాలి.