మంత్రి నారా లోకేశ్.. మండలి వేదికగా వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. “రాసి పెట్టుకోండి.. మీ అంతు చూస్తాం“ అని పదే పదే ఆయన బిగ్గర స్వరంతో హెచ్చరించారు. దీంతో చైర్మన్ జోక్యం చేసుకునే పరిస్థితి వచ్చింది. “మంత్రిగారూ.. ఇది రాజకీయ వేదిక కాదు. సంయమనం పాటించండి“ అని చైర్మన్.. మోషేన్ రాజు వ్యాఖ్యానించారు. దీంతో నారా లోకేష్ శాంతించారు. అయినప్పటికీ.. ఆయన మళ్లీ మళ్లీ వైసీపీ నాయకులను వదిలేది లేదన్నారు.
ఏం జరిగింది?
మంగళవారం మండలి ప్రారంభంలోనే వైసీపీ సభ్యులు టీడీపీ సభ్యులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశార ని.. ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. తొలుత గవర్నర్ ప్రసంగాన్ని ప్రస్తావించారు. తర్వాత సూపర్ సిక్స్ ను ఎగ్గొట్టారని వ్యాఖ్యానించారు. ఇలా.. వైసీపీ నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా నారా లోకేష్ సంయ మనంతోనే వారికి సమాధానం చెప్పారు. అయితే.. వైసీపీ సభ్యుడు ఒకరు.. తమ నాయకులపై కేసులు పెట్టి.. ఏం పీకారని వ్యాఖ్యానించారు. దీనిపై నారా లోకేష్ ఆగ్రహంతో ఊగిపోయారు.
వైసీపీ నాయకులు చేసిన దుర్మార్గాలు, దోపిడీలపై సీబీఐ వేసి.. విచారణ చేసి.. వారి అంతు చూసే దాకా కూటమి ప్రభుత్వం వదిలి పెట్టబోదని బిగ్గర స్వరంతో హెచ్చరించారు. ప్రతి ఒక్క నాయకుడి వ్యవహారా న్ని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తామనిచెప్పారు. అంతేకాదు.. అదికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలను వేధించిన వారిని కూడా వదిలేది లేదన్నారు. ప్రస్తుతం చాలా కేసుల్లో సీఐడీ విచారణ సాగుతోందని.. కొన్నింటిని త్వరలోనే సీబీఐకి అప్పగిస్తామని చెప్పారు.
“ఏ ఒక్కరినీ వదలం. రాసిపెట్టుకోండి. మీ అంతు చూస్తాం“ అని పదే పదే నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో వైసీపీ సభ్యులు ఒక్కసారిగా తమ తమ స్తానాల్లో నిలబడి.. మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని , రికార్డుల నుంచి తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన చైర్మన్.. మంత్రిగారు.. ఇది రాజకీయ వేదిక కాదు.. అని సముదాయించారు. అనంతరం.. సభను సజావుగా నడిచేలా.. సహకరించాలని ఇరు పక్షాలను అభ్యర్థించారు.