గత కొన్ని రోజులుగా.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన పథకం ` తల్లికి వందనం `. ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు. ప్రతి ఇంట్లోనూ.. ఎంత మంది పిల్లలు ఉంటే.. అంత మందికీ రూ.15000 చొప్పున ఒక్క రూపాయి కూడా తగ్గించకుండానే అందిస్తామని.. తాము అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇదేసమయంలో వైసీపీపై అప్పట్లో తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎంత మంది పిల్లలు ఉన్నా.. అంతమందికీ అమ్మ ఒడిని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ .. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ పథకాన్ని ఒక్కరికే అమలు చేశారని.. సంక్షేమ పథకానికి తూట్లు పొడిచారని చెప్పారు. అమ్మలకు ద్రోహం చేశారని అన్నారు. కానీ, తాము అలా చేయబోమన్నారు. ప్రతి ఇంట్లో ఇద్దరున్నా.. ముగ్గురున్నా.. నలుగురు, ఐదుగురు పిల్లలు ఉన్నా.. ఈ పథకాన్ని అమలు చేస్తామని.. ఆమేరకు రూ.15000 చొప్పున నిధులు ఇస్తామన్నారు.
అయితే.. ఇటీవల ఓ జీవో ఇచ్చారు. దీనిలో `తల్లి` అని పేర్కొనడంతో ఈ పథకంపై వైసీపీ యాగీ చేసింది. ఎంత మంది పిల్లలు ఉన్నా.. ఒక్కరికే ఇచ్చేలా ఇప్పుడు చంద్రబాబు మాట తప్పుతున్నారని.. ఎన్నికల కు ముందు ఆయన చేసిన ప్రసంగాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. అయితే.. ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉంది. తాజాగా ఈ విషయం శాసన మండలిలో చర్చకు వచ్చింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు.
ఎన్నికలకు ముందు ఏదైతే మాట ఇచ్చామో.. ఆ హామీకి తాము కట్టుబడి ఉన్నామని నారా లోకేష్ చెప్పారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. ఈ పథకాన్ని అమలు చేసి తీరుతామన్నారు. అదేవిధంగా గతంలో మాదిరిగా.. రూ.15000లలో రూ. 1000 ఒకసారి.. తర్వాత రూ.2000 మరో సారి కోత పెట్టారని.. ఇప్పుడు అది లేకుండాపూర్తి మొత్తం ఇస్తామన్నారు. అదేవిధంగా కార్లు ఉన్నా.. కూడా అమలు చేసేందుకు రెడీగా ఉన్నామన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విధివిధానాలపై కసరత్తు చేస్తున్నట్టు మంత్రి లోకేష్ వివరించారు. దీంతో పెను వివాదానికి ఆయన తెరదించినట్టయింది.