టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పిచ్చాటూరులో యువగళం అంటూ కదం తొక్కుతున్న నారా లోకేష్…ఆర్టీసీ బస్సులో సామాన్యుడిలా ప్రయాణించారు. అటుగా వస్తున్న బస్సు ఎక్కిన లోకేష్…ప్రయాణికులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ మూడున్నరేేళ్లలో 3 సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారని, కరెంటు బిల్లుల వంటివి కూడా పెరుగుతూనే ఉన్నాయని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఒక్కసారి కూడా బస్సు చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. జగన్ బాదుడే బాదుడు వల్ల ప్రజలపై విపరీతమైన భారం పడిందని లోకేష్ దుయ్యబట్టారు. పెంచిన ఆర్టీసి ఛార్జీలు తగ్గించాలని లోకేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం సిబ్బంది పడుతున్న ఇబ్బందుల గురించి కండక్టర్ను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆర్టీసీ కార్మికుల జీవితాలు మారిపోతాయిని వైసీపీ నేతలు ఊదరగొట్టారని లోకేష్ విమర్శించారు.
కానీ, విలీనం చేసిన తర్వాత ఆర్టీసీ కార్మికులను, ఉద్యోగులను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. విలీనానికి ముందున్న లబ్ది కూడా లేక ఆర్టీసీ సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఆర్టీసీ సిబ్బందికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత దక్కలేదని లోకేష్ మండిపడ్డారు. చివరగా ప్రయాణికులతో కలిసి సెల్ఫీలు దిగిన లోకేష్.. జాగ్రత్త అమ్మా… వెళ్లొస్తా… అంటూ ప్రయాణికులకు వీడ్కోలు పలికారు. ఆర్టీసీ బస్సులో లోకేష్ ప్రయాణించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.