సీఎం జగన్ పాలన అధ్వాన్నంగా ఉందని, జగన్ హయాంలో ఏపీ అప్పుల ఊబిలో మునిగిపోవడంతో పేదల బతుకు కష్టంగా మారిందని విపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇదే విషయాన్ని కంతేరులో వెంకాయమ్మ అనే మహిళ మీడియా ముందు బహిరంగంగా వెల్లడించింది. జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించింది. అంతేకాదు, మళ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని బల్లగుద్ది మరీ చెప్పింది.
ఇలా ప్రభుత్వ పరువు తీయడంతో వెంకాయమ్మ ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆమెను బెదిరించారు. ఈ క్రమంలో ఆ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. జగన్‌రెడ్డి పాలనలో పేదల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ఐదుకోట్ల ఆంధ్రుల అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన దళిత మహిళ కర్లపూడి వెంకాయమ్మకి సమాధానం చెప్పే దమ్ములేని వైసీపీ నాయకులు కంతేరులోని ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరిస్తారా? అంటూ లోకేష్ మండిపడ్డారు.
వెంకాయమ్మకి గానీ, ఆమె కుటుంబసభ్యులకి గానీ ఎటువంటి హాని తలపెట్టినా తీవ్ర పరిణామాలుంటాయని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. మీ దగ్గర ఉన్నది కిరాయి మూకలని… తమ దగ్గర ఉన్నది పార్టీ అంటే ప్రాణం పెట్టే లక్షలాది మంది సైనికులని లోకేష్ అన్నారు. నిరక్షరాస్య, నిరుపేద, దళిత మహిళ వెంకాయమ్మ మాటే ఏపీలో ప్రతీ ఇంటా, ప్రతీ నోటా వినిపిస్తోందని లోకేష్ చెప్పారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల పైనా దాడి చేయిస్తారా జగన్‌రెడ్డి గారు? అని లోకేష్ ప్రశ్నించారు.
రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మ కారును ధ్వంసం చేసి, ఆయనను చంపేస్తామని వార్నింగ్ ఇవ్వడంపై లోకేష్ మండిపడ్డారు. ఏలూరు సభలో జగన్‌రెడ్డిని చూసి జనం పారిపోతుండడంతో ఆయనలోని మూర్ఖపు ఫ్యాక్షన్ భూతం నిద్రలేచిందని లోకేష్ సెటైర్లు వేశారు. అందుకే, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ, జగన్‌రెడ్డి మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అవినీతిని బట్టబయలు చేస్తోన్న సాయినాథ్‌శర్మ కారుపై దాడి చేశారని దుయ్యబట్టారు.
జగన్ కు, ఆయన ఎమ్మెల్యేలకు ఓటమి ఫోబియా పట్టుకుందని, అందుకే ప్రశ్నించే ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులు చేసి భయపెట్టాలని చూస్తున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి గారి సీను కాలిపోయి చాన్నాళ్లయ్యిందని, ఆయన మాటలు బూటకమని, చేతలు నాటకమని జనానికి తెలిసిపోయిందని చురకలంటించారు. వైసీపీ దుకాణం సర్దుకోవాలని, ఆకురౌడీలకి ఎవ్వరూ భయపడరని లోకేష్ అన్నారు.
జగన్‌రెడ్డి పాలనలో పేదల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ఐదుకోట్ల ఆంధ్రుల అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన దళిత మహిళ కర్లపూడి వెంకాయమ్మకి సమాధానం చెప్పే దమ్ములేని వైసీపీ నాయకులు కంతేరులోని ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరిస్తారా?(1/3) pic.twitter.com/aPhKRNb8oX
— Lokesh Nara (@naralokesh) May 17, 2022