టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 27న ఉదయం 11.03 నిమిషాలకు పాదయాత్రకు ముహూర్తం ఖరారైంది. ఈ క్రమంలోనే పాదయాత్ర ప్రారంభానికి ముందు తిరుమలలో శ్రీవారిని లోకేష్ దర్శించుకున్నారు. పాదయాత్ర దిగ్విజయం కావాలని వెంకన్నకు లోకేష్ మొక్కుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ తో ఫోటోలు దిగేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు.
మరోవైపు, తిరుమలలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కుమారుడి వివాహానికి కూడా లోకేష్ హాజరయ్యారు. శ్రీనివాసులు కుమారుడు భరత్ వివాహానికి హాజరైన లోకేష్ వధూవరులను ఆశీర్వదించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో జరిగిన ఈ పెళ్లికి హాజరైన లోకేష్ ఆ తర్వాత అక్కడి నుంచి కుప్పానికి బయలుదేరారు. లోకేష్ రాక కోసం కుప్పంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. కుప్పంలో రేపు జరగబోతున్న సభ ఏర్పాట్లను టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తదితరులు పరిశీలిస్తున్నారు.
కుప్పంలో పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభను టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తదితరులు హాజరుకానున్నారు. ఇక, యువగళం పాదయాత్రకు సంఘీభావంగా చంద్రబాబు సొంత ఇలాకా కుప్పంలో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గం అంతా టీడీపీ జెండాలతో, బ్యానర్లు, ఫ్లెక్సీలతో పసుపుమయమైంది. కుప్పంలో ఎక్కడ చూసినా పసుపు జెండాలు రెపరెపలాడుతున్నాయి.