మాట తప్పను…మడమ తిప్పను అంటూ ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ ఎన్నో ప్రగల్భాలు పలికిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం అయిన తర్వాత జగన్ ఎన్నోసార్లు మాట తప్పి మడమను వంకర్లు టింకర్లుగా తిప్పారని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో రోడ్ల దుస్థితిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నా సరే జగన్ కు చీమకుట్టినట్టైనా లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ప్రతిపక్షంలో ఉన్నా సరే తాను ప్రజలకు మాట ఇస్తే నిలబెట్టుకుంటానని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిరూపించుకున్నారు.
అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు మేలు చేయడంలో టిడిపి ఎప్పుడు ముందుంటుందని లోకేష్ మరోసారి నిరూపించారు. మాట ఇచ్చిన 24 గంటల్లోనే ఓ గ్రామంలో ఏడు రోడ్లు వేసి రాబోయే టిడిపి పాలన ఇలా ఉంటుంది అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న లోకేష్ ఈ నెల 15వ తేదీన నియోజకవర్గంలోని ఉండవల్లి దేవుని మాన్యం ప్రాంతంలో పర్యటించారు.
అయితే, ఆ ప్రాంతంలోని రోడ్ల దుస్థితిని అక్కడి ప్రజలు లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో, ఆ వ్యవహారంపై వెంటనే స్పందించిన లోకేష్ ప్రభుత్వం అడ్డుకోకుంటే 48 గంటల్లో రోడ్ల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం 24 గంటలు గడవక ముందే ఆ ప్రాంతంలో దాదాపు 7 రోడ్లు సిద్ధం చేయించారు. మాట ఇచ్చిన 24 గంటలు గడవక ముందే హామీని నిలబెట్టుకున్న లోకేష్ ను స్థానికులు వేనోళ్ల పొగుడుతున్నారు. తమ ఇళ్లు కూలగొట్టేందుకు జగన్ జేసీబీలు పంపిస్తుంటే తమ ఇళ్లకు దారి వేసేందుకు లోకేష్ జేసీబీలు పంపిస్తున్నారని ఉండవల్లి దేవుని మన్యం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.