4000 కిలోమీటర్ల పాదయాత్రకు ఇంటి నుంచి తొలి అడుగు వేశారు నారా లోకేష్ . అమ్మానాన్నల ఆశీర్వచనం అందుకుని, భార్య బ్రాహ్మణి వీరతిలకం దిద్దగా ఆంధ్రప్రదేశ్ అంతటా 400 రోజుల పాటు పర్యటించడానికి లోకేశ్ కదిలివెళ్లారు. ఈ సందర్భంగా లోకేశ్‌ను జనంలోకి పంపించేందుకు మామ బాలకృష్ణ కూడా కుటుంబసమేతంగా అక్కడికి వచ్చారు.
చంద్రబాబు కుమారుడిని దగ్గరకు తీసుకుని భుజం తట్టి పంపించారు. భార్య బ్రాహ్మణి హారతి ఇచ్చి నుదుట తిలకం దిద్దారు. లోకేశ్ ప్రయాణించే వాహనానికి కొబ్బరికాయ కొట్టి దిష్టి తీశారు. మరోవైపు లోకేశ్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని సందడి చేశారు.
లోకేశ్ పాదయాత్ర చివరి వరకు అనుమతులు రాలేదు. యాత్ర ప్రారంభమవుతున్న చిత్తూరు జిల్లాలో మూడు రోజలకు అక్కడి పోలీసులు అనుమతులు ఇచ్చినా అనేక ఆంక్షలు విధించారు. కాగా ఇప్పటికే జీవో నంబర్ 1 పేరుతో ఏపీలో రోడ్ షోలకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ విషయం కోర్టులో ఉండగా… లోకేశ్ పాదయాత్ర విషయంలోనూ ఆంక్షలు విధించడంపై టీడీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు.
నారా లోకేశ్ పాదయాత్రకు ప్రభుత్వం, వైసీపీ, పోలీసుల నుంచి ఆటంకాలు ఎదురవుతాయని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఒకరకమైన గంభీరవాతావరణం అక్కడ కనిపించింది. 400 రోజుల పాదయాత్రలో లోకేశ్ ఎన్ని ఇబ్బందులు పడతారో అనే ఆందోళన భార్య, కుటుంబ సభ్యులలో కనిపించింది.