భీమవరం దగ్గర లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రపై కొందరు వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడికి తెగబడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భీమవరంలో లోకేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, లోకేష్ సున్నితంగా ఆ నోటీసులు తిరస్కరించారు. ఈ సందర్భంగా పోలీసులతో లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పక్కా పథకం ప్రకారమే యువగళం పాదయాత్రపై వైసీపీ మూకలు రాళ్లు, సోడాబుడ్లతో దాడికి తెగబడ్డాయని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని తాము గౌరవిస్తామని, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయలేదని పోలీసులతో అన్నారు. నాకు కాదు.. చట్టాన్ని అతిక్రమించిన వారికి నోటీసులు ఇవ్వండి అంటూ తనకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన భీమవరం సీఐ తో లోకేష్ అన్నారు. భీమవరం సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు ఆయన రాగా..లోకేష్ సున్నితంగా వాటిని తిరస్కరించారు.
ఇది ఎన్నికల సమయం కాదని, అన్ని వాహనాలు పెట్టకూడదని పోలీసులు ఎలా చెబుతారని లోకేష్ ప్రశ్నించారు. ప్రజలు తనపై అభిమానంతో వారి వారి వాహనాల్లో వస్తారని, శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్నా తమను రెచ్చగొడుతున్నారని అన్నారు. తామెక్కడా గొడవలు రేపలేదని, ఈ నోటీసును వైసీపీ శ్రేణులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పేదలకు, పెత్తందార్లకు యుద్ధం అంటూ చంద్రబాబు ఫొటోలు వేశారని ఆరోపించారు. జగన్ కు లక్ష కోట్ల ఆస్తి ఉందని, రూ.12 కోట్లు ఖర్చు పెట్టి లండన్ కి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లాడని, లక్ష రూపాయల చెప్పులు వేసుకుంటున్నాడని, వెయ్యి రూపాయలు విలువ చేసే వాటర్ బాటిల్ ని తాగుతున్నాడని, పెత్తందారు ఎవరు? అని ప్రశ్నించారు.
జగన్ ను తాను ఏం కించపరిచానో ఆయనే చెప్పాలని నిలదీశారు. వైసీపీ కార్యకర్తలను గొడవకు ప్రేరేపించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు నోటీసులివ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు. 2019 వరకు తనపై ఒక్క కేసు కూడా లేదని, తమ జోలికి వైసీపీ నేతలు వస్తే ఏం చేయాలో మీరే చెప్పండని పోలీసులను లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ వాళ్లు రాళ్లు విసిరిన ఘటనలో పోలీసులకూ గాయాలయ్యాయని, వాలంటీర్లు ఎక్కువ0 సంఖ్యలో గాయపడ్డారని చెప్పారు. ఎంపీ మిథున్ రెడ్డికి ఇక్కడ ఏం పని అని, పుంగనూరు పంచాయతీని ఇక్కడకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.