ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం జాతీయవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. అర్ధరాత్రి పూట వందలాది పోలీసులను తీసుకొని మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్టును టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, తన తండ్రిని చూసేందుకు వెళుతున్న తనను పోలీసులు అడ్డుకోవడంతో వారిపై లోకేష్ నిప్పులు చెరిగారు. లోకేష్ అమరావతి వెళ్తే శాంతి భద్రతల సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. దీంతో, తన తండ్రిని చూసేందుకు వెళ్లకుండా అడ్డుకోమని సైకో జగన్ చెప్పాడా అని పోలీసులను నిలదీశారు.
పిచ్చోడు లండన్ వెళ్ళాడు… మంచోడు జైలుకు వెళ్లాడు…ఆంధ్రప్రదేశ్ లో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది అంటూ జగన్ పాలనపై లోకేష్ ధ్వజమెత్తారు. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదని, కేవలం పిచ్చోడి కళ్ళల్లో ఆనందం కోసమే ఆయనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. జగన్ తలకిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వేయలేరని అన్నారు. తన తండ్రిని చూసేందుకు రాజ్యాంగం హక్కులు కల్పించిందని, అందుకు పోలీసుల అనుమతి ఎందుకని లోకేష్ ప్రశ్నించారు. పోలీసుల తీరుకు నిరసనగా క్యాంపు సైట్ దగ్గరే రోడ్డుపై బైఠాయించి లోకేష్ నిరసన వ్యక్తం చేశారు. మీ తండ్రిని ఎవరైనా ఇలాగే అరెస్ట్ చేస్తే రెస్ట్ తీసుకోమని మీరు చెబుతారా అంటూ పోలీసులపై లోకేష్ ఫైర్ అయ్యారు.
అసలు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో పోలీసులకు అర్థం అవుతుందా? సిగ్గుండాలి అని నిప్పులు చెరిగారు. తనను అడ్డుకోమని చెప్పిన పోలీస్ అధికారి పేరు ఏంటో వెల్లడించాలని, ఏ గొడవలు జరుగుతున్నాయని తనను ఆపుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మరోవైపు, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాయి. సీఎం డౌన్ డౌన్, పోలీస్ డౌన్ డౌన్ అంటూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో టిడిపి కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.