ధర్మవరంలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని, చెరువు కట్టను ఆక్రమించుకొని గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాను నేరం చేసినట్టు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపద్యంలోనే కేతిరెడ్డి సవాల్ కు లోకేష్ స్పందించారు. ఆ కబ్జాకు సంబంధించిన ఆధారాలను గూగుల్ మ్యాప్స్ తో సహా బయటపెట్టిన లోకేష్ కేతిరెడ్డికి షాక్ ఇచ్చారు.
కేతిరెడ్డి చెప్పినట్లుగా ఆయన తమ్ముడు భార్య వసుమతి పేరుతో కొన్నది 25.38 ఎకరాలేనని, గుట్టపైన మొత్తం 45 ఎకరాలు ఆక్రమణలో ఉందని లోకేష్ అన్నారు. మిగిలిన 20 ఎకరాలను కేతిరెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు. గూగుల్ మ్యాప్స్ ఆధారంగా కేతిరెడ్డి భూమిని కొలిస్తే 45.47 ఎకరాలు చూపిస్తుందని మిగిలిన 20 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది కేతిరెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలందరి సమక్షంలో ఎర్రగుట్టపై భూమిని కొలిచే దమ్ముందా కేతిరెడ్డి అంటూ లోకేష్ సవాల్ విసిరారు. అధికారులు అబద్ధం చెప్పినా గూగుల్ అబద్ధం చెప్పదుగా అంటూ సెటైర్లు వేశారు. మరి, లోకేష్ సవాల్ ను కేతిరెడ్డి స్వీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.