టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అగ్రనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో కొనసాగుతోంది. పెనుగొండలో లోకేష్ పాదయాత్ర 700 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 55వ రోజు పాదయాత్ర సందర్భంగా లోకేష్ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర చేస్తూనే మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు లోకేష్ జవాబిచ్చారు.
ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై లోకేష్ నిప్పులు చెరిగారు. జగన్ హయాంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లోకేష్ దుయ్యబట్టారు. పాదయాత్రలో మెజారిటీ ప్రజలు ఈ విషయంపై ఫిర్యాదు చేస్తున్నారని లోకేష్ అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నానని లోకేష్ అన్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత టిడిపిదేనిని చెప్పారు. అయినా సరే టిడిపి ఓటమిపాలు కావడం బాధగా అనిపించిందని లోకేష్ చెప్పారు. ఈ సందర్భంగానే పాదయాత్రకు ముందు పాదయాత్రకు తర్వాత లోకేష్ లో వచ్చిన మార్పులు ఏమిటి అంటూ విలేకరులు ప్రశ్నించారు. దీంతోపాటు విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు లోకేష్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
టీడీపీ హయాంలో కియా మోటర్స్ వంటి చాలా పరిశ్రమలు వచ్చాయని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని, అందుకే ప్రజలు తమకు ఓటు వేయలేదని అన్నారు. అందుకే, ఇప్పుడు ఇవన్నీ సెల్ఫీ రూపంలో ప్రజల ముందు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వైసీపీ సర్కార్ ది విధ్వంస పాలన అని, అభివృద్ధి చేయాలన్న తలంపు ఏ కోశాన జగన్ సర్కార్కు లేదని మండిపడ్డారు. కియా పరిశ్రమ రావడం చంద్రబాబు ఘనత అని, ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పరిపాలనను ప్రారంభించారని దుయ్యబట్టారు. అన్ని పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోవడమే తప్ప కొత్తగా పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. కియా పరిశ్రమ, కారుతో తీసుకున్న సెల్ఫీతో సెల్ఫీ ఛాలెంజ్ లో భాగంగా జగన్ కు లోకేష్ సవాల్ విసిరారు.