కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. సెకండ్ వేవ్ అంచానకు మించిన వేగంతో వ్యాప్తి చెందుతోంది. దీంతో.. ఇప్పటికే పలు రాష్ట్రాలు అప్రమత్తమైనప్పటికీ.. అవి తీసుకునే చర్యలు.. వైరస్ వేగాన్ని కట్టడి చేయటంలో విఫలమవుతున్నాయి. అందుకు నిదర్శనంగా ఏపీని చెప్పాలి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. నెల క్రితం రోజుకు వందల్లో మాత్రమే నమోదయ్యే పరిస్థితికి భిన్నంగా ఇప్పుడు వేలాది కేసులు నమోదవుతున్నాయి. అది కూడా వాయు వేగంతో.
ఏపీలోని గుంటూరు జిల్లానే తీసుకుంటే.. ఇప్పుడా జిల్లాలో వారం వ్యవధిలో 2231 పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గుంటూరు నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండి.. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.
దీంతో.. లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో.. ఎక్కడికక్కడ కేసుల తీవ్రత ఎక్కువగా ఉందో.. ఆయా ప్రాంతాల్లోని స్థానిక అధికారులు తమ విచక్షణతోకీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో వారం పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లుగా తహిసిల్దార్ ఆదేశాలు జారీ చేశారు. మండలం పరిధిలోని కొల్లిపర.. తూములూరు..దావులూరు అడ్డరోడ్డు గ్రామాల్లో లాక్ డౌన్ అమలవుతుందని పేర్కొన్నారు. టిఫిన్ సెంటర్లతో సహా అన్నింటిని మూసివేస్తున్నారు.
ఏదైనా వాణిజ్య కార్యకలాపాలు ఉంటే ఉదయం ఆరు నుంచి పదకొండు వరకు మాత్రమే నిర్వహించుకోవాలని నిర్ణయించారు. రానున్న రోజుల్లో ఇదే బాటలో మరికొన్ని మండలాల్లో నిర్ణయాలు తీసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది.