టాలీవుడ్ విలక్షణ దర్శకుడు పూరి జగన్నాథ్, యంగ్ హీరో విజయ్ దేవరకొండల కాంబోలో వచ్చిన లైగర్ సినిమా వారిద్దరి కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, అపూర్వా మెహతాతో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మిలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.
ఈ సినిమా ఫ్లాప్ కావడంతో పూరి జగన్నాథ్ ఆర్థికంగానూ నష్టపోయారు.
దానికితోడు ఈ చిత్రం కోసం డబ్బును హవాలా రూపంలో సమకూర్చారని ఈడి ఆరోపిస్తోంది.
ఈ క్రమంలోనే గతంలో పూరీ జగన్నాథ్, ఛార్మిలను విచారణ జరిపిన ఈడీ, తాజాగా హీరో విజయ్ దేవరకొండను కూడా 9 గంటలపాటు విచారణ జరిపింది.
లైగర్ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోవడంతోపాటు, ఆ సినిమా పంపిణీ హక్కుల్లో కూడా విజయ్ దేవరకొండకు భాగస్వామ్యం ఉందనే ప్రచారం జరిగింది.
అలా ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగస్వామి కోణంలో కూడా విజయ్ ను ఈడీ విచారణ చేసిందట.
ఈ సినిమాకు సంబంధించిన ఫండ్స్ ను దుబాయ్ పంపి హవాలా రూపంలో తిరిగి భారత్ కు తెప్పించి పెట్టుబడి పెట్టేలా చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ హవాలా సొమ్ము వ్యవహారంలో అమెరికాలోని ‘తానా’లో కీలక హోదాల్లో పనిచేసిన ఇద్దరు ప్రముఖ ఎన్నారైల పేర్లు వినిపిస్తున్నాయని పుకార్లు వస్తున్నాయి.
ఆ ఇద్దరు లైగర్ సినిమాలో మైక్ టైసన్ కు డబ్బులు చెల్లించేందుకు హవాలా రూపంలో డబ్బు సమకూర్చారని ఊహాగానాలు వస్తున్నాయి.
ఏదేమైనా లైగర్ హవాలా, మనీ లాండరింగ్ వ్యవహారంలో ‘తానా’కు చెందిన ఇద్దరు ప్రముఖులు ఉన్నారన్న పుకార్లు ఎన్నారై వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఇక, కొందరు రాజకీయ నేతలు కూడా మనీ లాండరింగ్ ద్వారా లైగర్ సినిమాలో పెట్టుబడులు పెట్టారని అధికారులు అనుమానిస్తున్నారు.
త్వరలోనే కరణ్ జోహార్, అపూర్వ మెహతాలకు నోటీసులు జారీ చేసి విచారణ చేస్తారని తెలుస్తోంది.
మైక్ టైసన్ రెమ్యునరేషన్ అంశాన్ని కూడా ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది.