తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్టు వ్యవహారం పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆ అరెస్టు తర్వాత హైకోర్టు ఆదేశాలతో డిసెంబరు 4 నుంచి పాదయాత్ర ఆగిపోయిన చెన్నారావుపేట నుంచే యాత్రను పున:ప్రారంభించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. అయితే, ఆ పాదయాత్రకు అనుమతిని పోలీసులు నిరాకరించారు. గతంలో అనుమతి ఇచ్చినప్పుడు చెప్పిన నిబంధనలను షర్మిల ఉల్లంఘించారని, అందుకే ఈ సారి అనుమతి ఇవ్వబోమని అన్నారు. దీంతో, షర్మిల పాదయాత్ర వాయిదా పడింది.
ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పాదయాత్రను చూసి కేసీఆర్ భయపడుతున్నారని, అందుకే పోలీసుల ద్వారా పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని షర్మిల షాకింగ్ ఆరోపణలు చేశారు. అంతేకాదు, కేసీఆర్ తో పాటు ఆయన గూండాల నుంచి తనకు ప్రాణహాని ఉందని షర్మిల సంచలన ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేసీఆర్ రాజకీయాలకు తన పాదయాత్ర అంతిమయాత్ర అవుతుందంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
తన పాదయాత్రను మూడుసార్లు అడ్డుకోవాలని చూశారని షర్మిల ఆరోపించారు. ప్రజల కోసం పోలీసులు పని చేయడం లేదని, కేసీఆర్, ఆయన కుటుంబం కోసం పనిచేస్తున్నారని షర్మిల విమర్శలు గుప్పించారు. పోలీసులను కేసీఆర్ పనివాళ్ళుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలను బట్టబయలు చేస్తున్నందుకే తనపై కక్ష సాధిస్తున్నారని షర్మిల ఆరోపించారు. హైకోర్టు తన పాదయాత్రకు అనుమతినిచ్చిందని, అయినా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఇది కోర్టు ధిక్కరణేనని షర్మిల మండిపడ్డారు. నర్సంపేటలో టిఆర్ఎస్ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని, కానీ తాము శాంతి భద్రతకు విఘాతం కలిగించామంటూ కేసులు నమోదు చేయడం ఏంటని షర్మిల మండిపడ్డారు. ఏదేమైనా కేసీఆర్ పై షర్మిల చేసిన తాజా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.