భారత సినీరంగంలో దిగ్గజ దర్శకుడి గా పేరు ప్రఖ్యాతలు గడించిన శ్యామ్ బెనగల్ (90) తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శ్యామ్ బెనగల్ ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. శ్యామ్ బెనగల్ మృతిపట్ల భారత సినీరంగ ప్రముఖులు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
1934లో అప్పటి హైదరాబాద్ సంస్థానంలో(ప్రస్తుతం హైదరాబాద్ లోని తిరుమలగిరి ప్రాంతంలో) శ్యామ్ బెనగల్ జన్మించారు. ఫొటోగ్రాఫర్ అయిన తన తండ్రి ఇచ్చిన కెమెరాతో 12 ఏళ్ల వయస్సులోనే శ్యామ్ బెనగల్ తన మొదటి చిత్రాన్ని రూపొందించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో మాస్టర్ డిగ్రీ సంపాదించారు. హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీని స్థాపించారు.
అంకుర్, మండీ, మంథన్, జుబేదా, సర్దారీ బేగం, నేతాజీ సుభాష్ చంద్రబోస్-ది ఫర్గాటెన్ హీరో తదితర సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, ఏఎన్ఆర్ జాతీయ అవార్డులను శ్యామ్ బెనగల్ అందుకున్నారు. శ్యామ్ బెనగల్ పది రోజుల క్రితం… డిసెంబర్ 14న తన 90వ పుట్టిన రోజును జరుపుకున్నారు.