తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సినిమాలు చూడడంలో భాషా బేధం పాటించరు. ఏ భాషకు చెందిన సినిమా అయినా బాగుంటే ఆదరిస్తారు. అలాగే మన హీరోలు కూడా అంతే. పరభాషా దర్శకుల దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అలాగే ఇతర భాషల నుంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి సినిమాలు చేయించడం కూడా ఎప్పట్నుంచో ఉన్నదే. కానీ తమిళ ఫిలిం ఇండస్ట్రీ, అక్కడి ప్రేక్షకులు మాత్రం ఇందుకు భిన్నం. అక్కడ పర భాషా చిత్రలు పెద్దగా ఆడవు. అలాగే ఇతర భాషల నుంచి ఆర్టిస్టులు, దర్శకులను తీసుకొచ్చి సినిమాలు చేయడమూ అరుదే. కానీ ఇప్పుడు కథ మారుతోంది.
తెలుగు సినిమా.. తమిళ చిత్రాలను దాటి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోయిన నేపథ్యంలో మన వాళ్లతో అక్కడి సినీ జనాలు చేతులు బాగానే కలుపుతున్నారు. వంశీ పైడిపల్లి, దిల్ రాజు వెళ్లి ఏకంగా అగ్ర కథానాయకుడు విజయ్‌తో ‘వారిసు’ సినిమా తీసి హిట్ కొట్టారు. వెంకీ అట్లూరి ఏమో.. ధనుష్‌కు ‘సార్’తో సూపర్ హిట్ ఇచ్చాడు. త్వరలోనే వెంకీ.. సూర్యతోనూ జట్టు కట్టబోతున్నాడు. ఇక నాగార్జున ‘కూలీ’లో, బాలయ్య ‘జైలర్-2’లో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో అరుదైన తెలుగు-తమిళ కలయికను చూడబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
తమిళ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం.. టాలీవుడ్ యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టితో సినిమా చేయబోతున్నట్లుగా ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ కలయికను ఎవ్వరూ ఊహించి ఉండరు. మణిరత్నంతో సినిమా చేయాలని ఎంతోమంది తెలుగు స్టార్లు కలలు కన్నారు. కానీ వాళ్లకు రాని అవకాశం నవీన్‌కు వచ్చిందంటే పెద్ద విశేషమే. ప్రస్తుతం మణిరత్నం ‘థగ్ లైఫ్’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత నవీన్‌తో తెలుగు-తమిళ భాషల్లో ఒక చక్కటి ప్రేమకథా చిత్రం తీయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మణి అంతటి వాడు ఏరి కోరి నవీన్‌ను హీరోగా ఎంచుకున్నాడంటే తన కెరీర్‌కు అంతకంటే మించిన అచీవ్మెంట్ లేదనే చెప్పుకోవాలి. ఈ వార్త నిజం కావాలని ఆశిద్దాం.