ఆవు చేలో మేస్తే..దూడ గట్టున మేస్తుందా? అన్నది పాత సామెత…సీఎం జగన్ ఆర్థిక నేరగాడన్న ఆరోపణలుంటే…మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై భూ కబ్జా ఆరోపణలు రావా అన్నది అప్డేటెడ్ సామెత. ఇదేదో ప్రాస కోసం రాసింది కాదు. తాజాగా మంత్రి అయిన ఉషా శ్రీచరణ్ అనుచరుల భూ కబ్జాలపై సాక్ష్యాత్తూ హైకోర్టులో దాఖలైన పిల్ ను బేస్ చేసుకొని రాసింది. మంత్రి ఉషశ్రీ చరణ్ అనుచరులు అనంతపురం జిల్లాలో ఏకంగా చెరువును ఆక్రమించిన ఘటనపై హైకోర్టులో పిల్ దాఖలైన వైనం ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం సమీపంలోని 100 ఎకరాల చెరువును మంత్రి ఉషా శ్రీ చరణ్, ఆమె అనుచరులు కబ్జా చేశారని ఆరోపణలు రావడం సంచలనం రేపింది. ఆ ఆక్రమణలను అడ్డుకోవాలంటూ కల్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఉమామహేశ్వర నాయుడు హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మంత్రి ఉషా శ్రీ చరణ్, ఆమె అనుచరుల పేర్లు ఆ పిల్ లో ఉండడంతో ఈ విషయం రాజకీయ దుమారం రేపుతోంది.
కల్యాణదుర్గంలోని సర్వే నంబర్ 329లో వందెకరాల విస్తీర్ణంలో ఉన్న సుబేదార్ చెరువు ఆక్రమణకు గురైందని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఆ చెరువును పూడ్చేసేందుకు వచ్చిన వైసీపీ నేతలకు టీడీపీ నేతలు అడ్డు తగలడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. కానీ, కొంత కాలంగా చెరువులోకి మట్టిని తరలించి పూడ్చి వేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. అక్కడ ప్లాట్లు, వెంచర్లు వేసి రియల్ ధందాకు తెరతీయాలన్నది మంత్రి ఆలోచన అని ఆరోపిస్తున్నారు.
కానీ, ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, మంత్రి స్పందించలేదు. దీంతో, ఉమామహేశ్వరనాయుడు హైకోర్టును ఆశ్రయించి పిల్ వేశారు. ఈ ఆక్రమణల గురించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పిల్ లో పేర్కొన్నారు. దీంతో, ఈ వ్యవహారంపై 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. 2 వారాలకు ఈ పిల్ విచారణ వాయిదా వేసింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఉషాశ్రీ చరణ్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా, ఉషా శ్రీ చరణ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆమెపై సొంత పార్టీ మహిళా కౌన్సిలర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన దగ్గర ఉషా శ్రీ చరణ్ అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించడం లేదని, అదేమని అడిగితే తనను తన అనుచరులతో కొట్టించారని కల్యాణదుర్గం కౌన్సిలర్ ప్రభావతి సంచలన ఆరోపణలు చేశారు. ప్రభావతి వద్ద నుంచి ఉషాశ్రీ చరణ్ రూ.1.50కోట్లను అప్పుగా తీసుకున్నారని, అందులో రూ.90 లక్షలకు తిరిగి చెల్లించగా…మిగతా సొమ్ము ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది.