“ఈ సృష్టిలో కల్తీలేనిది.. కల్తీకానిది.. ఏదైనా ఉంటే అది అమ్మ పాలే“- అంటారు ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ. అయితే.. తిరుమల శ్రీవారికి ఉన్నకోట్లాదిమంది భక్తులు .. అమ్మ పాల తర్వాత.. అయ్యవా రి ప్రసాదం అత్యంత పవిత్రమని, కల్తీకి ఆస్కారం లేదని కూడా భావిస్తారు. ఇప్పుడంటే..శ్రీవారి ప్రసాదం విరివిగా లభిస్తోంది కానీ.. ఒక ప్పుడు 10 ఏళ్ల కిందటి వరకు కూడా.. రెండు లడ్డూలు దక్కించుకోవడం గగనంగా ఉండేది. దీంతో అత్యంత పవిత్రం అనే మాట వచ్చింది. ఎంతో అబ్బరంగా కళ్లకు అద్దుకుని.. నెత్తిన పెట్టుకుని.. చిటికెడు లడ్డూ ప్రసాదం లభించినా.. ధన్యమని భావించేవారు.
అలాంటి పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో `కల్తీ` అనే మాటే ఎప్పుడూ వినిపించలేదు.. ఎక్కడా ప్రచారం కూడా కాలేదు. అసలు భక్తులు ఈ మాట అనేందుకే కాదు.. వినేందుకు కూడా సాహసించేవారు కాదు. అసలు ఎవరికీ ఆ ఆలోచనే లేదు. అలాంటి అత్యంత పవిత్రమే కాదు.. భక్తులకు అత్యంత విశ్వసనీయ మైన లడ్డూ ప్రసాదం.. కల్తీ అయిందని తెలియగానే.. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తీవ్ర మానసిక ఆవేదన లో కూరుకుపోయారు. వారికి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
సాధారణంగా కల్తీ అంటే నాణ్యమైన పంచదారను వాడలేదనో.. నాణ్యమైన శనగపిండిని వాడకుండా.. బియ్యం పిండిని కలిపారనో.. అనుకున్న భక్తులకు రోజు రోజుకు బాంబులాంటి వార్తలు బయటకు వస్తుం టే.. విని తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. పంది కొవ్వు, దున్నపోతుల కొవ్వు, చేప నూనెలు వాడారని వస్తున్న వార్తలు.. భక్తుల గుండెలను చిదిమేస్తున్నాయి. దీంతో ఇప్పుడు శ్రీవారి ప్రసాదం అంటే.. భక్తి పక్కకు పోయి.. అనుమానం పెరిగిపోయింది. దీనంతటికీ కారణం.. వైసీపీనేనన్నది కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం.
అయితే.. ఈ ప్రచారంలో ఇప్పుడైతే.. వైసీపీ దోషిగా మారిపోయింది. ఎంత ఘోరంగా మారపోయిందంటే.. హిందూ ఓటు బ్యాంకు కకావికలం అయిపో యేంతగా పార్టీ పరిస్థితి దెబ్బతినేసింది. దీనిని ఖండించేందుకు కూడా.. వైసీపీలోని శ్రీవారి భక్తులు బయటకు రాకపోవడం.. మరోవైపు హిందూ సంఘాలు నిప్పులు చెరగడంవంటివి గమనిస్తే.. బలమైన ఓటు బ్యాంకు వైసీపీకి దూరమైపోయిందనే వాదన సర్వత్రా వినిపిస్తుండడం గమనార్హం. ఇప్పుడు ఆపార్టీ నేల చూపులు చూడడం తప్ప.. చేయాల్సింది.. చేయగలిగింది కూడా .. ఏమీలేదు. అంతా.. జగన్మాయగానే ఇప్పుడు వైసీపీ పరిస్థితి మారిపోయింది.