వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రంలోని హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. జగన్ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఆయన మర్డర్ కేసు విచారణ సరిగ్గా జరగడం లేదని ఆరోపణలు రావడంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివేకాను అత్యంత దారుణంగా, పాశవికంగా, అత్యంత ఘోరంగా, కిరాతకంగా హత్య చేసిన వాళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారని, రేపటి రోజున తనకు, ఎవరికీ కూడా రక్షణ ఉండదని కేవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాక్షసులు ప్రవర్తించిన విధంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యంత క్రూరంగా వివేకాను చంపినవారెవైనా సరే అతడో, వారో చేసింది క్షమించరాని నేరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటువంటి నేరాన్ని వదిలేస్తే..సమాజానికి భద్రత లేదని, మీకు నాకు ఎవ్వడికీ రక్షణ లేదని అన్నారు. ఇటువంటి కిరాతకమైన చర్య చేసిన వారిని శిక్షించకుండా వదిలేయకూడదని, మానవత్వం ఉన్నవారెవరరైనా ఆ హత్యను ఖండించాల్సిందేనని చెప్పారు. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండి ఉంటే వివేకాను చంపాలన్న ఆలోచన చేసే ధైర్యం ఎవ్వడికైనా ఉందా అని కేవీపీ ప్రశ్నించారు. ఏది ఏమైనా…దివంగత నేత వైఎస్సార్ ఆత్మగా పేరున్న కేవీపీ చేసిన తాజా వ్యాఖ్యలు జగన్ ను టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. వివేకా కేసుపై కేవీపీ కామెంట్ల వీడియో వైరల్ గా మారింది.