రాజకీయం ఎంత రసకందాయంలో ఉన్నా కూడా పెద్ద పండుగలకు ఒకట్రెండు రోజుల ముందు నుంచి రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టేసే ధోరణి తెలంగాణలో కొట్టొచ్చినట్లుగా కనిపించేది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్. పండుగ లేదు.. మామూలు రోజు లేదు. క్యాలెండర్ లో తేదీ మారింతనే ఆ రోజుకో పొలిటికల్ ఇష్యూను తెర మీదకు తీసుకొచ్చే తీరు కేటీఆర్ లో అంతకంతకూ ఎక్కువ అవుతున్న పరిస్థితి.
తాము అధికారంలో ఉన్నప్పుడు ఏ మీడియా సంస్థలను అయితే తిట్టిపోశారో.. వాటి విశ్వసనీయత మీద సందేహాలకు గురయ్యేలా మాటలు మాట్లాడేయటం.. ఎటకారాలు చేసేయటంతో పాటు.. తప్పు చేస్తున్నారు మీరు.. మాకు అనుకూలంగా ఉండాలే కానీ.. మమ్మల్ని కాదంటారా? అన్న కోపాన్ని సైతం దాచుకోకుండా బాహాటంగా ప్రదర్శించిన కేటీఆర్ అండ్ కో తీరు విమర్శల పాలవుతోంది. అధికారం చేజారిన తర్వాత తన రాజకీయాలకు అదే పత్రికలకు సంబంధించిన ప్రభుత్వ వ్యతిరేక వార్తల క్లిప్పింగులతో సోషల్ మీడియాలో హడావుడి చేసే జోరుకు కాస్త బ్రేకులు వేస్తే బాగుంటుందన్న టాక్ వస్తోంది.
పండుగల వేళ బద్ధ శత్రువులైన దేశాలు సైతం కాల్పుల విరమణ వేళను పాటిస్తుంటాయి. కానీ.. పొలిటికల్ వైరాన్ని పండుగ వేళలోనూ రగిలించేందుకు తపించే కేటీఆర్ తీరు కాస్తంత ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంది. దీపావళి లాంటి రోజున కూడా తన మాటలు హైలైట్ కావాలన్న వ్యూహంలో భాగంగా ఆన్ లైన్ లో నెటిజన్లతో మాట్లాడే కార్యక్రమానికి తెర తీశారు కేటీఆర్. నెటిజన్లను ప్రశ్నలు వేయమని చెప్పి (ఆస్క్ కేటీఆర్).. వారు వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
అందులో కొన్ని కీలకమైన వ్యాఖ్యల్ని చూస్తే..
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. రోజూ మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 2025 తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి విస్తృతంగా వస్తారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం ఆయన సమయం ఇస్తున్నారు.
– బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి కేసీఆర్ సమయం ఇస్తున్నారు.
– పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత వచ్చే అసమ్మతి కారణంగానే ఓడిపోయాం. కాంగ్రెస్ అబద్ధపు హామీలు ప్రజల్లో తప్పుడు ఆశలు రేకెత్తించాయి. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి అంటూ ఏమీ లేదు.
– ప్రస్తుత రాజకీయాల్లో కుటుంబ సభ్యులను సైతం వదలటం లేదు. పాలిటిక్స్ లోకి వారిని ఎందుకు లాగుతున్నారో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివేమీ చేయలేదు.
– నా పద్దెనిమిదేళ్ల ప్రజా జీవితంలో నా కుటుంబ సభ్యులు.. పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఒక దశలో రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నా. కానీ.. ప్రజల కోసం నిలబడి, పోరాడాలని నిర్ణయించుకున్నా.
కేటీఆర్ నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు చదివినంతనే.. ఆయన మాటల్లో లాజిక్ కనిపించదు. పదేళ్ల కేసీఆర్ పాలనలో చోటు చేసుకున్న ఎన్నో అంశాలు ఆయన మాటల్ని మనసు ఒప్పుకోకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. దీపావళి పండుగ రోజున రాజకీయాలు వదిలేసి ప్రశాంతంగా కుటుంబంతో సమయం గడిపితే బాగుంటుందన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.