టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. టెస్లా కార్లతో ఆటోమొబైల్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన మస్క్…స్సేస్ టెక్నాలజీతో చరిత్ర పుటల్లో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. ఇక, ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా నిలిచిన మస్క్…తన టెస్లా కార్లను చాలా దేశాలకు పరిచయం చేయాలని చూస్తున్నారు. అయితే, కొన్ని దేశ ప్రభుత్వాలతో అనుమతుల వ్యవహారంపై ఇబ్బందులున్నాయని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మస్క్ జవాబిచ్చారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆ ట్వీట్ పై తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో టెస్లా కార్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని మస్క్ ను కేటీఆర్ ఆహ్వానించారు. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు, టెస్లాతో కలిసి పని చేసేందుకు సంతోషిస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా సుస్థిర నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ ముందు ఉందని, భారత్‌లో వ్యాపారాలకు అగ్రశ్రేణి గమ్యస్థానంగా తెలంగాణ ఉందని కేటీఆర్ అన్నారు.
టెస్లాను కేటీఆర్ ఆహ్వానించడం ఇంటరెస్టింగ్ మూవ్ అని ప్రముఖ జర్నలిస్ట్ సుచేతా దలాల్ అన్నారను. గతంలో నరేంద్ర మోడీ సీఎంగా ఉన్నప్పుడు టాటా మోటార్స్‌కు రెడ్ కార్పెట్ పరిచారని, ఆ తర్వాత జయలలిత ఫోర్డ్, హ్యుండాయ్లను ఆహ్వానించడంతో లక్ష ఉద్యోగాలు వచ్చాయని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఐఎస్బీని హైదరాబాద్ తీసుకువచ్చారని నెటిజన్లు అంటున్నారు.