తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న వ్యక్తిని జైల్లో ఎందుకు పెట్టకూడదని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తన బంధువుకు 10వేల కోట్ల రూపాయల కోవిడ్ కాంట్రాక్టు వచ్చిందని రేవంత్ ఆరోపించారని, సచివాలయం కింద నిజాం నగలు తవ్వుకున్నట్లు కధలు అల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోలను రేవంత్ సర్కులేట్ చేశారని ఆరోపించారు.
తెలంగాణలో ఫ్యాక్షన్ సంస్కృతిని మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ ప్రాంతానికి తీసుకువచ్చారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని దారుణంగా హత్య చేశారని, ఈ హత్యకు కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు మంత్రి జూపల్లి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండో హత్య అని, ఇది ప్రజాపాలన కాదని, ప్రతీకార పాలన అని ఆరోపించారు. తమకు స్థానిక పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదని, సిట్ ఏర్పాటు చేసి విచారణ జరపాలని లేదంటే జ్యూడిషల్ విచారణకు ఆదేశించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కొల్లాపూర్ లోని గ్రామీణ ప్రాంతాలలో బీఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని గతంలోనే తమ పార్టీ నేతలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, స్థానిక ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ తరహా దాడుల సంస్కృతి కొనసాగితే తమ పార్టీ నేతలు, కార్యకర్తలను నియంత్రించే పరిస్థితి తమకు కూడా ఉండదని వార్నింగ్ ఇచ్చారు.