బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత ఇటీవల రాసిన లేఖ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే అంతర్గతంగా తాను రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందంటూ కవిత గగ్గోలు పెట్టారు. కేసీఆర్ దేవుడని.. కానీ ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని కవిత విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌లో కొందరు కోవర్టులు ఉన్నారని.. వారి తొలగిస్తేనే పార్టీకి మనుగడ అంటూ కవిత వ్యాఖ్యానించారు.
కవిత లేఖపై తాజాగా కేటీఆర్ స్పందించారు. శనివారం నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వచ్చిన ఆరోపణలపై మాట్లాడేందుకు కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కవిత లేఖపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దాని గురించి మాట్లాడేది ఏమీ లేదంటూ రెండు ముక్కల్లో తేల్చేశారు.
`పార్టీలో ఏ కార్యకర్త అయినా సూచనలు చేయాలనుకుంటే లేఖలు రాయొచ్చు. కానీ అంతర్గత విషయాలను అంతర్గతంగానే చర్చించుకోవాలి. పార్టీలో తనతో సహా అందరూ కార్యకర్తలే. ఈనిర్ణయం అందరికీ వర్తిస్తుంది` అంటూ కవిత పేరు ఎత్తకుండానే ఆమెకు కేటీఆర్ ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు.
అలాగే ప్రతి పార్టీలోనూ కోవర్టులు ఉంటారు.. టైమ్ వచ్చినప్పుడు వారెవరన్నది బయటపడుతుందని కేటీఆర్ అన్నారు. ఇక పార్టీలో దెయ్యాలు ఉన్నారని కవిత చేసిన ఆరోపణలపై మీడియా ప్రశ్నించగా.. ప్రస్తుతం తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, అసలు దెయ్యం రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి పట్టిన ఆ శనిని, ఆ దెయాన్ని వదిలించడంపైనే తమ పార్టీ దృష్టి సారించిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.