గతానికి భిన్నమైన పరిస్థితి వర్తమానంలో ఉంది. మర్యాదల్ని పక్కన పెట్టేసి.. ఎవరి చేతిలో అధికారం ఉంటే వారిని మర్యాదపూర్వకంగా ప్రశ్నించే కన్నా.. వారికి సాగిలపడటం.. లేదంటే నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఒక అలవాటుగా మారింది. ఇలాంటి వేళలో.. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి పూర్తిస్థాయి కమాండ్ తో మాట్లాడుతూ.. ఎదుటున్న వారికి నోట మాట రాకుండా చేసే మేజిక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకరిద్దరికి మించి లేదనే చెప్పాలి. ఆ ఒకరిద్దరిలో ముందుటారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక్రిష్ణ (ఆర్కే).
ఆయన ఇంటర్వ్యూ చేసే ధోరణి విషయంలోనూ బిగ్ డిబేట్ నడుస్తుంటుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే.. కీలకమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ తో నిర్వహించిన బిగ్ డిబేట్ రాజకీయ వర్గాల్లో పెను ఆసక్తి వ్యక్తమైంది. ఒకప్పటి జానీ జిగర్ స్నేహితుడైన కేసీఆర్ తో.. రాధాక్రిష్ణకు మధ్య నడిచిన వైరం మొదలు.. ఆ చానల్ టెలికాస్ట్ చేయకుండా గులాబీ బాస్ పెట్టిన తిప్పలు.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవటమే కాదు.. కేసీఆర్ పెట్టే పరీక్షలకు వెనకడుగు వేయకుండా.. రాజీ పడకుండా.. తన పోరును సాగిస్తున్న క్రెడిట్ ఆర్కేకు దక్కుతుంది.
అలాంటిది ఎన్నికల సమయంలో తన ఒకప్పటి సన్నిహిత మిత్రుడి కొడుకుతో చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ఇటీవల కాలంలో కేటీఆర్ పలువురు ప్రముఖులతో పాటు.. ప్రముఖ చానళ్లకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ.. తాజా ఇంటర్వ్యూ మీద వ్యక్తమైన ఆసక్తిని చూస్తేనే.. ఈ ఇంటర్వ్యూకు ఉన్న తేడా ఇట్టే అర్థమవుతుంది.
లైవ్ ఇంటర్వ్యూ ఆరంభంలోనే ఆంధ్రజ్యోతి ఆర్కే విసిరిన పంచ్ కు మంత్రి కేటీఆర్ నోట మాట రాని పరిస్థితి. ఏదో అనుకుంటే మరేదో అన్నట్లుగా మొదలు మొదలే ఊహించని పంచ్ వేసిన వైనం అందరిని ఆకర్షించేలా చేసింది. ఇంటర్వ్యూలో ఆరంభంలో.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కలుస్తామన్న మాటతో పాటు.. నవ్వితే బాగుంటావు.. నవ్వమన్న ఆర్కే సలహాకు స్పందించిన కేటీఆర్.. గతంలోనూ మీరు చెప్పారన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తనను నవ్వుతూ ఉండాలని.. బాడీ లాంగ్వేజ్ లో మార్పు తెచ్చుకోవాలన్న సూచన చేశారని ప్రస్తావించారు.
ఇలాంటి వేళ.. ఆర్కే నోటి నుంచి అనూహ్య రీతిలో వచ్చిన ఒక మాట ఆశ్చర్యకరంగా మారింది. మాట తీరు మారాలంటూ సలహా ఇస్తూనే ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సెటైర్ వేశారు. ‘‘మీ నాన్న ఉన్నాడు. అలా అలవోకగా జోకులు వేస్తాడు. నవ్వుతుంటాడు. నవ్విస్తాడు. మొయిన్ నవ్విస్తాడు. అంతే.. అదో జిమ్మిక్కు. సరుకు ఉన్నా లేకున్నా అదో జిమ్మిక్కు’’ అన్న మాట అన్నప్పుడు మంత్రి కేటీఆర్ నుంచి ఆశించే రియాక్షన్ వేరుంటుంది.
కానీ.. ఆర్కే చేసిన కామెంట్ కు కేటీఆర్ నవ్వేస్తూ.. కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యను పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తూ.. ‘‘సహజసిద్ధంగా రావాలి. కొన్ని నేర్చుకోవాలి’’ అంటూ ఒద్దికగా సమాధానం ఇచ్చారు. దీంతో.. ఇంటర్వ్యూ ఆరంభంలోనే కేటీఆర్ ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపించారు. నెర్వస్ గా అనిపిస్తోందా? అన్న ప్రశ్నకు బదులిచ్చిన కేటీఆర్.. ‘‘ఐదేళ్ల క్రితం 2018లోనే ఇదే వాతావరణం. అయిపోయింది.. అయిపోయింది.. ఓడిపోతున్నారని ప్రచారం చేశారు.
ఆర్నెల్ల క్రితం కూడా ఇదే హడావుడి. బీజేపీ వచ్చేసింది. కొట్టేశామని హడావుడి. వాస్తవం ఏమిటంటే.. ఆర్నెల్ల క్రితం బీజేపీనే మాకు ప్రత్యామ్నాయం అని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హవా ఉందంటున్నారు. అప్పట్లో బీజేపీ హవా అన్నోళ్లే.. ఇప్పుడు కాంగ్రెస్ హవా ఉందంటున్నారు. నాకు అర్థమైనంతవరకు ఏమంటే.. రెండో స్థానం కోసం జరుగుతున్న హడావుడిలో మా మీద ఏదో రుద్దుతున్నారంతే’’ అంటూ గెలుపు ధీమాను వ్యక్తం చేశారు. ఈ మాటల క్రమంలో తాను రాజకీయాల్లోకి వచ్చిన పద్దెనిమిదేళ్లు అయ్యిందన్న కేటీఆర్ మాటలకు.. బాగానే ముదిరిపోయానంటావ్’ అన్న ఆర్కే పంచ్ కు కేటీఆర్ బదులివ్వకుండా నవ్వేయటం గమనార్హం.