కొన్ని రంగాల్లో ఉన్న వారికి కొన్ని విషయాలు అస్సలు సూట్ కాదు. కానీ.. అలాంటివేమీ పట్టనట్లుగా వ్యవహరించే తీరు ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. దేశ ప్రధానిగా ఉండే వారు.. ఒక సెలబ్రిటీ మాదిరి.. ఒక బడా వాణిజ్య సంస్థ మాదిరి మార్కెటింగ్ టెక్నికులు ప్రజల మీద సంధించటం ఏం బాగుంటుంది.
ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు మీకో కీలకమైన విషయాన్ని చెబుతానని దేశ ప్రధాని నోటి నుంచి మాట వస్తే.. యావత్ దేశం.. ఆ అంశం ఏమై ఉంటుందన్న ఉత్సుకత వ్యక్తమైంది. పనిలో ఉన్న వారు సైతం.. ప్రధాని నోటి నుంచి ఆ మాట వచ్చింది కదా అని ఆరు గంటల వేళలో ఫాలో అయితే ఆయన చెప్పిన మాటలు ఏమిటో తెలిసిందే. కరోనా విషయంలో కేర్ ఫుల్ గా ఉండాలన్న మాటను ఆయన నొక్కి వక్కాణించటం చూసినప్పుడు.. ప్రధాని స్థానంలో ఉన్న వారి నోటి నుంచి ఇలాంటి మాటలా? అని ఆశ్చర్యపోయారు.
ఒక కమర్షియల్ ఎపిసోడ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో దేశానికి నాయకత్వం వహించే వారు వ్యవహరించటం సరికాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. లాక్ డౌన్ వేళ.. గంటలు కొట్టాలని.. దీపాలు వెలిగించాలని.. పూలవర్షం కురిపించాలన్న టాస్కులు బాగున్నట్లు అనిపించినా.. దేశ ప్రజల్లో మనో ధైర్యాన్ని నింపేందుకు అంతకు మించి చేయొచ్చన్నది నిజం.
సర్ ప్రైజ్ పేరుతో కీలక నేతలు చేసే ప్రకటలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. మోడీ తీరును.. ఆయన నిర్ణయాల్ని తప్పు పట్టే తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. ఇటీవల కాలంలో రేపొద్దున ఓ గుడ్ న్యూస్ చెబుతా.. అని పేర్కొనటం.. చివరకు ఏమిటా గుడ్ న్యూస్ అంటే.. రాష్ట్రంలో ఫలానా వారు పెట్టుబడులు పెడుతున్నారు.. ఫలానా కంపెనీ రాబోతుందన్న మాటలు వినిపిస్తున్నాయి.
కీలక స్థానాల్లో ఉన్న వారు ఇలాంటి సర్ ప్రైజ్ ల కంటే కూడా.. పనికి వచ్చే పనులు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలకమైన కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి సంబంధించిన వివరాలు ఫలానా రోజున. ఫలానా టైంకు ప్రకటిస్తానని చెప్పటం.. చూస్తే.. ప్రభుత్వ పరపతిని పెంచేందుకు తాజాగా వేస్తున్న సరికొత్త ఎత్తుగడగా చెప్పక తప్పదు.