దుబ్బాక ఓటమి తర్వాత కూడా టీఆర్ఎస్ ఇంకా పూర్తిగా మారలేదు. ప్రజల మూడ్ ని ఇంకా టీఆర్ఎస్ అర్థం చేసుకోవడం లేదు. గతంలో కేసీఆర్ చెప్పిన చాలా హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఇపుడు కేసీఆర్ నిజం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. దీంతో ప్రజలు కేసీఆర్ మ్యాజిక్ లకు దూరంగా ఉన్నారు. అయితే, కేటీఆర్ గేమ్ చేంజర్ అవుతారు అనుకుంటే… ఆయనలోని అధికార దర్పం ఓట్లను పోగొట్టేలా ఉంది.
ఎంతో చేశాం, మరోసారి గెలిపిస్తే ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి అవి కూడా చేస్తాం అన్నటోన్లో ఉండాల్సిన టీఆర్ఎస్ ప్రచారం … కానీ మేము తప్ప మీకు దిక్కెవరు అన్న టోన్లో ఉంది. ఓటమి తర్వాత కూడా టీఆర్ఎస్ స్వరం మారలేదు. తెలంగాణలో పాపం అనిపిస్తే జనం వారి వైపు ఉంటారు. కానీ టీఆర్ఎస్ పట్ల పాపం అని అనుకునే మూడ్ జనంలో లేదు. అహాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నడూ క్షమించరు. ఆ అహమే టీఆర్ఎస్ ని దుబ్బాకలో ఓడించింది.
తాజాగా కేటీఆర్ మాట్లాడిన మాటల్లోనే అదే కనిపించింది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు నమ్మాలి, తాము ఏం చెప్పామో అదే చేశామని, తాము చేయగలిగిందే చెబుతామని, తాము చేసిన అభివృద్ధి కళ్లముందే ఉందని, ప్రజలు ఆ విషయాన్ని గమనించాలని సూచించారు. హైదరాబాద్ పౌరుడ్ని అయినందుకు గర్విస్తున్నానని కేటీఆర్ అన్నారు.
ప్రజలకు కనిపించే అభివృద్ధి చేస్తే ప్రత్యేకంగా వారిని ఓట్లను అడగాల్సిన అవసరం లేదు. కానీ టీఆర్ఎస్ ఓట్లడిగితే పద్ధతిలో అభిమానం లేదు. దర్పం మాత్రమే ఉంది. ఇదే టీఆర్ఎస్ ను దెబ్బతీయొచ్చు అని విశ్లేషకులు అంటున్నారు.