అందరూ ఉత్కంటగా ఎదురుచూస్తున్న గ్రేటర్ ఎన్నికలు దగ్గరకు వచ్చినట్లే. దీపావళి వెళ్లిపోయిన ఒకట్రెండు రోజుల తర్వాత గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా పండగ వేళలోనూ తెలంగాణ అధికారపక్ష నేతలు ఉరుకులు పరుగులు తీస్తూ ఓపెనింగ్ లు చేస్తున్నారు. పలు వరాలు అందిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా దీపావళి కానుకను మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గ్రేటర్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో చెల్లించే ఆస్తి పన్నుకు యాబై శాతం రాయితీ ఇస్తున్నట్లుగా ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు.
గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి మరిన్ని వరాలు ఇచ్చేందుకు తెలంగాణ అధికారపక్షం సిద్ధమైనట్లు చెబుతున్నారు. తాము ప్రకటించే వరాల్లో గ్రేటర్ ఓటర్లు అందరూలబ్ది పొందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కీలకమైన నల్లా బిల్లు మీదా కూడా ఆసక్తికర ప్రకటన ఉంటుందంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. పోటెత్తిన వరదల ఇబ్బందుల్ని మరిచేలా హామీలు ఉంటాయని చెబుతున్నారు.
మొత్తంగా తాము తప్పించి మరెవరూ ప్రత్యామ్నాయం కాదన్న భావన కలిగించి.. గ్రేటర్ లో తాము అనుకున్న సీట్లను సొంతం చేసుకోవాలన్న ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. ఏ చిన్న నిర్లక్ష్యం కూడా ఉండొద్దని భావిస్తున్నారు.
అన్ని అనుకున్నట్లు జరిగితే.. రానున్న మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని.. ఆ లోపు మరిన్ని ప్రారంభోత్సవాలకు.. మరికొన్ని వరాల్ని ఇవ్వటంతో పాటు.. కీలక నిర్ణయాలు వెలువడే వీలుందన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే.. పండుగ వేళలోనూ కీలక అధికారులతో మంత్రి కేటీఆర్ రివ్యూ పెట్టుకోవటం ఈ వాదనకు బలం చేకూరేలా చేస్తుందని చెప్పొచ్చు.
అయితే, బీజేపీ మాత్రం మంచి ఊపు మీద ఉంది. దుబ్బాక ఎన్నికతో కొత్త ఉత్సాహంతో పనిచేస్తున్న బీజేపీ అసలే తాము బలంగా ఉండే జీహెచ్ఎంసీని ఈసారి కైవసం చేసుకుని సంచలనం సృష్టించానలని ప్రయత్నం చేస్తోంది. బీజేపీ దెబ్బకు టీఆర్ఎస్ హిందు ముస్లిం భాయి భాయి అంటోంది. దీంతో బీజేపీ కి గేమ్ మరింత ఈజీ అయ్యేలా ఉంది.